వ్యతిరేక వార్తలు రాసినందుకు షాపు కూల్చివేత
మాచర్ల నియోజకవర్గంలో బరితెగిస్తున్న తెలుగుదేశం గూండాలు కారంపూడిలో ఓ పేపర్ రిపోర్టర్ షాపును పొక్లెయిన్‌తో ధ్వంసం టీడీపీ నాయకుల ఆగడాలపై వార్త రాసినందుకు తనపై కక్ష సాధించారన్న జర్నలిస్ట్ జానీబాషా తన సొంత స్థలంలో షాపు ఉంటే ప్రభుత్వ స్థలమని ధ్వంసం చేశారని ఆవేదన ప్రభుత్వ స్థలమైతే అధికారులు నోటీసు ఇచ్చి తొలగించాలంటున్న జానీ బాషా టీడీపీ గూండాలు వచ్చి కూల్చడమేంటని ఆగ్రహం
సాక్షి, టాస్క్‌ఫోర్స్: చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పల్నాడులో తెలుగుదేశం పార్టీ నేతలు, గుండాల అరాచకాలకు అంతులేకుండా పోతోంది. తమకు వ్యతిరేకంగా ఓటేసినా, మాట్లాడిన వారిపై దాడులు చేస్తున్నారు. ఊర్ల నుంచి వెళ్లగొడుతున్నారు. టీడీపీ అరాచకాలను ప్రశ్నిస్తూ వార్తలు రాస్తున్న జర్నలిస్టు ఆస్తులను దగ్గరుండి ధ్వంసం చేస్తున్నారు. మాచర్ల నియోజకవర్గం కారంపూడి మండల కేంద్రానికి చెందిన సీనియర్ రిపోర్టర్(సాక్షి కాదు) షేక్ మగ్బుల్ జానీ బాషాకు చెందిన టీస్టాల్‌ను ఆదివారం అర్థరాత్రి టీడీపీ నేతలు దగ్గరుండి పొక్లెయిన్‌తో కూలగొట్టించారు. షాపులో సామగ్రిని దౌర్జన్యంగా బయటేశారు. విద్యుత్ సిబ్బందిని కరెంటు కట్ చేయాలని హెచ్చరించి ఆపై పొక్లెయిన్‌తో షాపును అత్యంత దుర్మార్గంగా కూల్చి వేశారు. రిపోర్టర్‌కు బీపీ పెరిగి అక్కడే కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యు లు ఆర్తనాదాలు చేస్తున్నా పట్టించుకోకుండా షాపును నిర్ధాక్ష్యిణ్యంగా కూల్చి వేశారు. జానీబాషా కుటుంబం ఆ షాపు పైనే వచ్చే రాబడితోనే ఆధారపడి జీవిస్తున్నారు. జానీబాషాకు ఆరోగ్యం సరిగా లేక బాగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో కుటుంబానికి ఆధారమైన షాపును కూల్చివేయడంతో కన్నీటిపర్యంతమవుతున్నారు.
షాపు తనదేనని తెలిపే
అన్ని పత్రాలున్నాయి..
ఈ సందర్భంగా జానీ బాషా మాట్లాడుతూ.. తాను 1997 నుంచి రిపోర్టర్‌గా పని చేస్తున్నానని ప్రభుత్వ అక్రిడిడేషన్ కూడా ఉందన్నారు. గతంలో తన తండ్రి కారెంపూడి ఈఓగా పనిచేస్తున్న కాలంలో కూడా టీడీపీ నాయకుడు చప్పిడి రాము తదితరులు షాపుపై పిటిషన్ ఇచ్చారని తర్వాత దానిని ఉపసంహరించుకున్నారన్నారు. ఎంతో కాలంగా 30 గజాల్లో తనకు షాపు ఉందన్నారు. స్థలం తనది అని తెలిపే డాక్యుమెంటు, సర్వే సర్టిఫికెట్, ఈ స్థలంతో పంచాయతీకి సంబంధం లేదని తెలిపే సర్టిఫికెట్ అలాగే ఇతర అన్ని పత్రాలున్నాయన్నారు. ప్రభుత్వ స్థలమై తే సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలి కాని టీడీపీ నాయకులకు ఏం సంబంధమని జానీబాషా ప్రశ్నించారు. ప్రభుత్వ పథకాలు సరిగా అమలు చేయడం లేదని ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నందుకే టీడీపీ నాయకులు కక్ష కట్టారన్నారు.
షాపు కూలగొట్టడానికి
టీడీపీ నాయకులెవరు..?
టీడీపీ మండల అధ్యక్షుడు గోళ్ల సురేష్, చప్పిడి రాము, ఇన్‌ఛార్జి సర్పంచ్ భర్త బాలూ నాయక్ తదితరులు షాపును కూలగొట్టించారన్నారు. ప్రభుత్వ స్థలమైతే ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకోవాలి కాని టీడీపీ నాయకులెవరు ఇలా చేయడానికి అని జానీబాషా ప్రశ్నించారు. రౌడీల్లా వ్యవహరిస్తూ ఆస్తులు ధ్వంసం చేయడం మంచి పద్ధతా అని ప్రశ్నించారు. అత్యంత దుర్మార్గంగా రౌడీల్లా వ్యవహరించారని ఆవేదన వ్యక్తం చేశారు. విలేకరికే రక్షణ లేకపోతే ఇక మిగతా వారి పరిస్థితేమిటని ప్రశ్నించారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. జిల్లా కలెక్టర్‌ను కలిసి న్యాయం చేయాలని కోరనున్నట్లు ఆయన పేర్కొన్నారు. తనకు జరిగిన అన్యాయంపై న్యాయపోరాటం చేస్తానన్నారు.


