ఆర్‌వీఆర్‌జేసీలో నేషనల్ అగ్రిటెక్ హ్యాకథాన్ ప్రారంభ
గుంటూరు రూరల్: వ్యవసాయ రంగంలో నూతన ఆవిష్కరణలతో విద్యార్థులు అన్నదాతకు అండగా నిలవాలని, ప్రతి ఇంటి నుంచి ఒకరు వ్యవసాయ వృత్తిలో భాగస్వాములవ్వాలని కేంద్ర ప్రభుత్వ ఐసీఏఆర్ నారమ్ ఏఐడీయా అడిషనల్ సీఈఓ డాక్టర్ విజయ్ తెలిపారు. చౌడవరంలోని ఆర్‌వీఆర్‌జేసీ ఇంజినీరింగ్ కళాశాలలో ఎస్.టి.పి ఫౌండేషన్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ ఆధారిత సంస్థల సహకారంతో రెండు రోజుల పాటు జరగనున్న నేషనల్ అగ్రిటెక్ హ్యాకథాన్–2025 సోమవారం ప్రారంభించారు. దేశవ్యాప్తంగా 17 రాష్ట్రాల నుంచి 66 జట్లు, 200 మంది విద్యార్థులు పాల్గొన్నారు. వ్యవసాయం, మత్స్య పరిశ్రమ, పశుపోషణ, చిరుధాన్యాల రంగాల్లోని సవాళ్లకు సాంకేతిక పరిష్కార మార్గాలను సూచించారు. వ్యవసాయ రంగానికి సంబంధించిన విద్యార్థుల నూతన ఆవిష్కరణల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో సాంకేతిక ఆవిష్కరణలను మరింత అభివృద్ధి చేసేందుకు డాక్టర్ విజయ్, కళాశాల సెక్రటరీ ఆర్ గోపాలకృష్ణలు ఎమ్‌వోయూ కుదుర్చుకుని ఒప్పంద పత్రాలను అందుకున్నారు. గుంటూరు, పల్నాడు జిల్లాల నాబార్డ్ ఏసీఎం జి. శరత్ బాబు, ఢిల్లీ ఇందిరాగాంధీ టెక్నికల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎస్. రాంనారాయణరెడ్డి, కళాశాల అధ్యక్షుడు ఆర్. శ్రీనివాస్ పాల్గొన్నారు.


