వినుకొండలో అగ్నిప్రమాదం
వినుకొండ: స్థానిక 16వ వార్డులో జరిగిన అగ్నిప్రమాదంతో కౌలు రైతు కుటుంబం రోడ్డున పడింది. సాగు చేసిన పంటతోపాటు, ఇంట్లోని సామగ్రి, వాహనం అగ్నికి ఆహుతయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి... పట్టణానికి చెందిన చిందుకూరి వెంకటేశ్వర్లు అనే రైతు జాలలపాలెం రోడ్డులోని కెమికల్ ఫ్యాక్టరీ సమీపంలో సుమారు 15 ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని తన కుమారుడితో కలిసి వ్యవసాయం చేస్తున్నాడు. కష్టపడి పండించిన ఏడు క్వింటాళ్ల పొగాకును, సాగు కోసం తెచ్చిన 30 బస్తాల ఎరువులను తన ఇంటి పక్కనే ఉన్న రేకుల షెడ్‌లో భద్రపరిచాడు. సోమవారం తెల్లవారుజామున ఒక్కసారిగా షెడ్‌లో మంటలు చెలరేగాయి. నిద్రలో ఉన్న కుటుంబసభ్యులు, పొరుగువారు గమనించేలోపే మంటలు భారీగా వ్యాపించాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. అయితే అప్పటికే మూడు లక్షలకు పైగా నష్టం జరిగిందని బాధితుడు వాపోయాడు. ఈ ప్రమాదంలో నిల్వ ఉంచిన పొగాకు, ఎరువుల బస్తాలతో పాటు వ్యవసాయ పనులకు ఉపయోగించే హీరో హోండా బైక్, ఇతర సాగు పరికరాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. బాధితుడు ఇప్పటికే పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఏడాది కాలం కష్టపడి పండించిన పంట కళ్లముందే బూడిదై పోయింది. ఇప్పుడు మాకు జీవనాధారం కోల్పోయాం అని వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు.
వినుకొండలో అగ్నిప్రమాదం


