ఆర్థిక లావాదేవీలపై అధిక ఫిర్యాదులు
జిల్లా ఎస్పీ కార్యాలయంలో పీజీఆర్‌ఎస్ ఫిర్యాదులు స్వీకరించిన అడిషినల్ ఎస్పీ(క్రైమ్) లక్ష్మీపతి వివిధ అంశాలపై 84 ఫిర్యాదులు
నరసరావుపేట రూరల్: లోన్‌యాప్ వేధింపులు, ఆటోఫైనాన్స్ ఇబ్బందులు వంటి ఆర్థిక అంశాలపై అధిక ఫిర్యాదులు పీజీఆర్‌ఎస్‌లో అధికారులకు అందాయి. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం పీజీఆర్‌ఎస్ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా అదనపు ఎస్పీ(క్రైం) సీహెచ్ లక్ష్మీపతి కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఆర్థిక, కుటుంబ సమస్యలుతో పాటు పలు మోసాలకు సంబంధించిన సమస్యలపై 84 ఫిర్యాదులు అందాయి. నిర్ణీత సమయంలో ప్రజల ఫిర్యాదులను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
దొంగలు దొరికినా బైక్ ఇప్పించడం లేదు
సీసీ కెమెరా సహాయంతో తన బైక్‌ను దొంగిలించిన దొంగలను పట్టించినా పోలీసులు బైక్‌ను రికవరీ చేయకుండా ఇబ్బందులు పెడుతున్నారని దాచేపల్లికి చెందిన బండి కృష్ణారావు ఫిర్యాదు చేశాడు. దొంగతనం జరిగి 13 నెలలు గడుస్తున్నా ఎస్‌ఐ పాపారావు, హెడ్‌కానిస్టేబుల్ రాఘవయ్యలు ఎటువంటి చర్య తీసుకోలేదని తెలిపారు. దొంగలపై ఎటువంటి కేసు పెట్టకుండా విడిచిపెట్టారని, తనను మాత్రం స్టేషన్ చుట్టూ తిప్పుకుంటున్నారని పేర్కొన్నారు. తన సమాచారంతో దొంగల వద్ద నుంచి పలు బైక్‌లను స్వాధీనం చేసుకున్నారని, తన బైక్‌ను మాత్రం రికవరి చేయడం లేదని తెలిపారు.
‘లోన్ యాప్’ వేధింపులు..
సత్తెనపల్లి మండలం కట్టమూరు గ్రామానికి చెందిన మహిళ ఇంటి ఖర్చుల నిమిత్తం ట్యాలీ వెల్త్ యాప్‌లో రూ.2200లు తీసుకుని వారానికి తిరిగి చెల్లించింది. ఆ తరువాత రూ.8వేలు తీసుకుని సకాలంలో చెల్లిస్తూ వచ్చింది. ఈనెల 22వ తేదీ కిస్తీ చెల్లించాల్సి ఉండగా ఒక రోజు ముందుగానే చెల్లించాలని మేసేజ్‌లు వచ్చాయని, చెల్లించేందుకు ప్రయత్నించగా మొబైల్‌లో ఫెయిల్ యువర్ పేమెంట్ వస్తున్నట్టు తెలిపారు. 21వ తేదీ నుంచి వివిధ నెంబర్ల నుంచి డబ్బులు కట్టకపోతే న్యూడ్ ఫొటోలు అందరికీ పంపిస్తామని బెదిరిస్తున్నట్టు తెలిపారు. లోన్ యాప్‌పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు.
అధిక వడ్డీతో ఆటో ఫైనాన్స్ ఇబ్బందులు
పిడుగురాళ్ల మండలం కరాలపాడు గ్రామానికి చెందిన వ్యక్తి కొత్త ఆటో కొనుగోలు చేసేందుకు పిడుగురాళ్ల బస్టాండ్ ఎదురుగా ఉన్న ఆటో ఫైనాన్స్‌లో రూ.2.65లక్షలు రుణం తీసుకుని 36 కిస్తీలు వడ్డీతో కలిపి 3.84లక్షలు చెల్లించే విధంగా ఒప్పందం చేసుకున్నాడు. ఈ మేరకు రూ.3.47లక్షలు చెల్లించగా మిగిలిన రూ.37వేలకు రూ.1.42లక్షలు వడ్డీ చెల్లించాలని ఫైనాన్స్ సంస్థ కోరింది. బకాయి మొత్తం చెల్లించే వరకు ఆటో ఇవ్వమని బెదిరిస్తున్నారని, అధిక వడ్డీలపై చర్యలు తీసుకోవాలని కోరాడు.


