
మూల్యాంకన విధానం మార్పు చేయాలి
ఏపీటీఎఫ్ డిమాండ్
నరసరావుపేట ఈస్ట్: పాఠశాలల్లో పరీక్షల నిర్వహణలో మూల్యాంకన పుస్తకాల విధానంలో మార్పులు తీసుకురావాలని ఏపీటీఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. మూల్యాంకన విధానం పాఠశాలల్లో బోధనా సమయాన్ని హరించే విధంగా ఉందని తెలిపారు. గతంలో పరీక్షలను పేపర్లపై నిర్వహించి ఇంటికి తీసుకువెళ్లి మూల్యాంకనం చేసేవారమని, ప్రస్తుతం పుస్తకాలను ప్రవేశపెట్టడం వల్ల వాటిని పాఠశాలలోనే చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని వివరించారు. దీనికితోడు మార్కుల ఆన్‌లైన్, రిజిస్టర్‌లో నమోదు, బబ్లింగ్ వంటి అదనపు పని భారంతో బోధనాభ్యాసాలకు సమయం లేకుండా పోతున్నదని పేర్కొన్నారు. కొత్త విధానం వల్ల సత్ఫలితాలు రాకపోగా, నష్టదాయకమని వివరించారు. మార్కులు ఆన్‌లైన్ నమోదుకు పరిమితం చేసి, మిగిలిన వాటి నుంచి వెసులుబాటు ఇవ్వాలని కోరారు. ఈ మేరకు డీఈఓ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఎం.డి.ఉస్మాన్, ప్రధాన కార్యదర్శి వి.వి.రవికుమార్, ఉపాధ్యక్షుడు ప్రజామూర్తి, బాళ్ల శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శి మక్కెన శ్రీనివాసరావు పాల్గొన్నారు.