
నగదు కోసం యాచకుడి హత్య
నిందితుడి అరెస్ట్
తెనాలి రూరల్: నగదు కోసం యాచకుడైన వృద్ధుడిని హత్య చేసిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక త్రీ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం సీఐ ఎస్. రమేష్ బాబు వెల్లడించిన వివరాల ప్రకారం.. పట్టణ త్రీ టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో యాచకుడు వెంకటనారాయణ(70) జూన్ 8న రాత్రివేళ మృతి చెందాడు. పోస్టుమార్టం అనంతరం హత్యకు గురైనట్లు నిర్ధారించి, కేసు నమోదు చేశారు. సీసీ కెమెరా ఫుటేజ్ ద్వారా దర్యాప్తు చేపట్టారు. అవనిగడ్డ మండలం లంకమాన్యం ప్రాంతానికి చెందిన నిందితుడు కొల్లి రాజేష్‌ను అరెస్టు చేశారు. స్థానిక రైల్వే స్టేషన్ రోడ్డులోని సాయిబాబా గుడి వెనుక ఓ టింబర్ డిపో వద్ద నిద్రించిన వృద్ధుడి వద్ద రూ.3 వేల నగదు ఉంది. ఈ విషయం గమనించిన రాజేష్ అతడిపై దాడి చేసి హతమార్చి నగదుతో పారిపోయాడు. దీంతో అతడిని పోలీసులు అరెస్టు చేశారు. సమావేశంలో ఎస్‌ఐలు ప్రకాశరావు, కరిముల్లా, కానిస్టేబుళ్లు మురళి, జయకర్ బాబు, సురేష్ పాల్గొన్నారు.