
యువతులపై గంజాయి మూక దాడి
టీడీపీ నేత అండతో హత్యా బెదిరింపులకు పాల్పడుతున్నట్లు బాధితుల ఆందోళన గంజాయి తాగేందుకు డబ్బు ఇవ్వలేదని తన తండ్రిపై దాడి చేశారంటూ కుమార్తె ఫిర్యాదు పోలీసులు సైతం వారికే వత్తాసు పలుకుతున్నారని ఆరోపణ తమకు న్యాయం చేయాలని జిల్లా ఎస్పీని ఆశ్రయించిన బాధితులు
గుంటూరు రూరల్: కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత మహిళలపై జరుగుతున్న దారుణాలకు అంతే లేకుండా పోయింది. అదేమంటే గంజాయి, మద్యం తాగొచ్చి ‘చంపేస్తాం’ అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. అధికారం తమది అంటూ రెచ్చిపోతున్నారు. ఇదే తరహా సంఘటన శుక్రవారం రూరల్ మండలంలోని దాసరిపాలెం గ్రామంలో వెలుగు చూసింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం... దాసరిపాలేనికి చెందిన కొరబడి మరియదాసు ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఆయనకు కుమార్తె ఉంది. ఆమె గుంటూరులో ఒక దుకాణంలో కూలీ పనులు చేస్తోంది. ఈ క్రమంలో రెండు రోజుల కిందట మరియదాసు ఇంటి నుంచి రోడ్డుకు వచ్చాడు. అదే సమయంలో నాని, చిన్న, కార్తిక్, ఆనంద్, మరికొందరు మరియదాసును మద్యం తాగేందుకు డబ్బు ఇవ్వాలని అడిగారు. లేవని చెప్పడంతో అప్పటికే గంజాయి మత్తులో ఉన్న రౌడీమూక దాడి చేయడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డాడు. మరియదాసు కుమార్తె, సోదరి దీనిపై ఆ మూకను నిలదీశారు. దీంతో వారిపైనా దాడి చేసి, నోటికి వచ్చినట్లు దుర్భాషలాడారు. ఇంకోసారి కనిపిస్తే చంపేస్తామని బెదిరించారని బాధితులు ఆరోపించారు. మరియదాసును చికిత్స నిమిత్తం జీజీహెచ్‌కు తీసుకువెళ్లారు. అనంతరం నల్లపాడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దాసరిపాలేనికి చెందిన సుధీర్ అనే టీడీపీ నాయకుడు జోక్యం చేసుకుని, నిందితులు తమ పార్టీకి చెందిన వారేనని పోలీసులకు చెప్పారని బాధితులు తెలిపారు. దీంతో పోలీసులు సైతం తమనే తిట్టి వెనక్కి పంపారని వాపోయారు. స్థానిక ఎమ్మెల్యే మనిషి సుధీర్ కావడంతో అతడు ఏది చెబితే అదే చేస్తామని పోలీసులు అంటున్నారని ఆరోపించారు. ఇంటి నుంచి బయటకు రావాలంటే భయంగా ఉందని, తమను గంజాయి బ్యాచ్ నుంచి కాపాడాలని బాధితులు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. న్యాయం చేయాలని కోరారు.