
అంధుల క్రికెట్ టోర్నీ విజేత ‘ఆంధ్రా గ్రీన్’
గుంటూరు వెస్ట్ (క్రీడలు): ఏపీ రాష్ట్ర అంధుల క్రికెట్ జట్టు కోసం గత మూడు రోజులుగా స్థానిక అరండల్‌పేటలోని ఏసీఏ క్రీడా మైదానంలో క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ ది బ్‌లైండ్ ఏపీ, విజువల్లీ బ్‌లైండ్ ఎంప్లాయీస్ అసోసియేషన్, డిఫరెంట్ డిసేబుల్ క్రికెట్ కౌన్సిల్ ఆఫ్ ఏపీ సంయుక్తాధ్వర్యంలో జరిగిన పోటీలు శుక్రవారంతో ముగిశాయి. విజేత జట్టుగా ఆంధ్రా గ్రీన్స్ జట్టు నిలిచింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిభ కనబరిచిన 42 మందిని ఎంపిక చేసి ఆంధ్రా బ్లూ, ఆంధ్రా ఎల్లో, ఆంధ్రా గ్రీన్ పేరుతో పోటీలను నిర్వహించారు. ఆంధ్రా గ్రీన్ విజేతగా నిలిచింది. వీసీఈఏ అధ్యక్షుడు జి.రవీంద్ర బాబు ముఖ్యఅతిథిగా జరిగిన బహుమతి ప్రదానోత్సవంలో క్రికెట్‌కు అండగా నిలుస్తున్న రామకృష్ణ పరమహంస, మోటివేషనల్ స్పీకర్ శ్రీధర్‌బాబు, మాజీ బ్లైండ్ క్రికెటర్, అర్జున అవార్డు గ్రహీత అజయ్ కుమార్ రెడ్డి విజేతలకు ట్రోఫీని అందించారు. ఈ సందర్భంగా అజయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ క్రికెటర్లను ప్రోత్సహించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందించాలని కోరారు. ఉత్తమ ప్రతిభ చాటిన వారిని జాతీయ స్థాయి పోటీలకు రాష్ట్రం తరఫున పంపిస్తామని తెలిపారు. పోటీల ప్రారంభోత్సవానికి రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కృష్ణమోహన్ రావడం ఎంతో సంతోషాన్నిచ్చిందని చెప్పారు. కార్యక్రమంలో టోర్నమెంట్ నిర్వహకులు కొలగాని శ్రీనివాసరావు, ఎల్వీఆర్ క్లబ్ ప్రతినిధులు పాల్గొన్నారు.