
మెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీ
ప్రభుత్వ తీరును దుయ్యబట్టిన వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగ నాయకులు
నరసరావుపేట: కూటమి ప్రభుత్వ పెద్దలు మెగా డీఎస్సీని దగా డీఎస్సీగా మిగిల్చారని వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగ నాయకులు పేర్కొన్నారు. లింగంగుంట్ల కాలనీలోని జిల్లా పార్టీ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన మీడియా సమావేశంలో విద్యార్థి విభాగ జిల్లా అధ్యక్షులు గుజ్జర్లపూడి ఆకాష్‌కుమార్ మాట్లాడారు. డీఎస్సీని నిర్వహించడంలో విద్యాశాఖ పూర్తిగా విఫలమైందని తెలిపారు. డీఎస్సీ పరీక్షల ఫలితాలు ఇంటర్నెట్‌లో పెట్టకుండా నియామకాలు చేసేందుకు పూనుకున్నారని వెల్లడించారు. గత ప్రభుత్వంలో మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 3లక్షల మందికి ఔట్‌సోర్సింగ్ ద్వారా ఉద్యోగాలు కల్పించగా, కూటమి ప్రభుత్వం వారందరి ఉద్యోగాలు ఊడ బెరికిందని తెలిపారు. కార్యక్రమంలో విద్యార్థి విభాగ నియోజకవర్గ అధ్యక్షులు విజయరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు ఉప్పుతల వేణు, నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ బూదాల కల్యాణ్, మణికంఠారెడ్డి, షేక్ నాగూర్, హరి పాల్గొన్నారు.