
దశాబ్దంగా ‘దారి’ద్య్రం
వర్షం వస్తే కాలువను తలపిస్తున్నమాదిపాడు రోడ్డు ప్రత్యామ్నాయ ఏర్పాట్లతోసరిపెడుతున్న అధికారులు శాశ్వత పరిష్కారానికి నోచుకోని రోడ్డు వర్షం పడుతున్నప్పుడల్లా స్తంభిస్తున్న రాకపోకలు
అచ్చంపేట: ఓ సమస్యతో తరచూ ఇబ్బందులకు ఎదురైతే ఎవరైనా శాశ్వత పరిష్కారం కోసం అన్వేషిస్తారు. కానీ అచ్చంపేటలోని మాదిపాడు రోడ్డు విషయంలో అధికారులు తూతూమంత్రంగా చర్యలు తీసుకుని, అప్పటికి తమ పనైపోయిందిలే అని చేతులు దులుపుకుంటున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు మాదిపాడు రోడ్డు టర్నింగ్‌లో పాత సినిమా హాలు సెంటర్ నుంచి సీతారామస్వామి రైస్ మిల్ వరకు నడుం లోతులో నీళ్లు ప్రవహించాయి. ఆర్టీసీ బస్సులు ఆగిపోయాయి. ప్రజలు నానా అవస్థలు పడ్డారు.
పలు గ్రామాలకు ప్రధాన రహదారి
జిల్లాలో చిట్టచివరి గ్రామమైన మాదిపాడుకు వెళ్లేందుకు ప్రధాన రహదారి ఇదే. పులిచింతల ప్రాజెక్టుతో పాటు కృష్ణానదికి అవతలి వైపునున్న ఎన్టీఆర్ జిల్లాలోని గ్రామాలకు నదిపై నడిచే పడవలు, బల్లకట్టులకు ప్రజలు వెళ్లేందుకు ఇదే రహదారి. పవిత్ర పుణ్యక్షేత్రాలైన ముక్త్యాల, పెనుగంచిప్రోలు, వేదాద్రి, కోటిలింగాల మహాక్షేత్రం, కోర్కెలు తర్చే తల్లిగా భక్తులు విశ్వశించే సత్తెమ్మతల్లి వద్దకు చేరుకోవాలన్నా ఈ మార్గమే శరణ్యం. నిత్యం అచ్చంపేటకు మాదిపాడు, చల్లగరిక, తాడువాయి చింతపల్లి, పుట్లగూడెం, చెరుకుంపాలెం, కొత్తపల్లి, తాళ్లచెరువు తదితర గ్రామాలకు చెందిన విద్యార్థులు, రైతులు, డ్వాక్రా మహిళలు అచ్చంపేటకు వస్తుంటారు. ఇంత ప్రాధాన్యం గల రోడ్డులో వర్షం పడినప్పుడల్లా నీళ్లు నిలబడి రోజుల తరబడి రాకపోకలకు అంతరాయం కలుగుతున్నా శాశ్వత పరిష్కారానికి నోచుకోవడంలేదు. ఈ సమస్య ఈనాటిది కాదు. పదేళ్లుగా ఎవరూ పట్టించుకోవడం లేదు.
అర కిలోమీటరు మేర రోడ్డు పల్లం
పాత సినిమా హాలు సెంటర్‌లో సుమారు అర కిలోమేటరు మేర రోడ్డు పల్లంలో ఉంది. ఒక మోస్తరు వర్షం పడితే చాలు, నీళ్లు పోయే మార్గంలేక రోడ్డుపై నడుం లోతు నిలుస్తాయి. రోడ్డుకు పక్కనే 33/11కేవి విద్యుత్ సబ్ స్టేషన్ ఉంది. ఈ నీళ్లు మొత్తం అందులోకి చేరడంతో సరఫరా నిలిపి వేస్తున్నారు. ఇక విద్యుత్ వినియోగదారులు బిల్లులు చెల్లించడానికి , సిబ్బంది ఆఫీసుకు నీళ్లలో నుంచి నడుచుకుంటూ వెళ్లాలి.
అధికారుల నిర్లక్ష్యం
వర్షం పడ్డప్పుడలా అరకిలోమేటరు మేర రోడ్డు వాగును తలపిస్తుంది. పక్కన ఆక్రమణలు మెరకై , రోడ్డు పల్లమైంది. సైడు కాలువలు మొత్తం పూడిపోయాయి. వర్షం నీళ్లు వెళ్లాలంటే పొలాల్లోంచి కాలువలు తీసి, కిలోమీటరు దూరంలో ఉన్న కృష్ణానదిలో కలపాలి. లేనిపక్షంలో దిగువన తూర్పువైపున రాజీవ్‌నగర్ కాలనీ పక్కగా సైడు కాలువలు తీసి చిగురుపాడు వాగులోనైనా కలపవచ్చు. అధికారులు, పాలకులు పట్టించుకుంటే ఇదేమంత పెద్ద విషయం కాదు.