
సాగులో వినూత్న ఒరవరి
జగిత్యాల సన్న రకం వరి సాగుకు మొగ్గు చూపుతున్న రైతులు గతంతో పోల్చితే పెరిగిన విస్తీర్ణం బీపీటీ రకంతో పోల్చితే వ్యవధి తక్కువ అధిక దిగుబడి ప్రత్యేకత పల్నాడులో 5,500 క్వింటాల విత్తనాలు అవసరం అంటున్న వ్యవసాయ శాఖ అధికారులు డిమాండ్ నేపథ్యంలో కృత్రిమ కొరత అధిక ధరలకు అమ్ముతున్న వ్యాపారులు ఇతర రకాలను సాగు చేయాలని సూచిస్తున్న వ్యవసాయాధికారులు
ప్రభుత్వ నిర్లక్ష్యం
సాక్షి, నరసరావుపేట: ఈ ఏడాది జగిత్యాల సన్నాలు (జేజీఎల్–384) రకం వరి సాగు చేయడానికి పల్నాడు జిల్లా రైతులు మక్కువ చూపుతున్నారు. గతంతో పోల్చితే సాగు విస్తీర్ణం బాగా పెరిగింది. దీంతో విత్తనాలకు గత రెండేళ్లుగా డిమాండ్ అధికంగా ఉంది. గతేడాది ఇదే సమయంలో దొరక్క పల్నాడు జిల్లా రైతులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. సాగు సమయం ఆసన్నమవడం, సాగర్‌లో పుష్కలంగా నీరు ఉండటంతో నారు పోద్దామని ఆశ పడ్డారు. ప్రభుత్వ నిర్లక్ష్యం నిరాశనే మిగిల్చింది. విత్తనాలు దొరకలేదు. జోరు వర్షంలో సైతం క్యూలైన్లలో మహిళలు, వృద్ధులు కూడా నిలబడి మరీ అధిక ధరలకు కొనుగోలు చేశారు.
పలు మండలాల్లో రైతుల ఆసక్తి
నరసరావుపేట, రొంపిచర్ల, నకరికల్లు మండలాల రైతులు జేజీఎల్–384 వరి సాగుకు అధికంగా మొగ్గు చూపుతున్నారు. గతేడాది అధిక దిగుబడులు చూసిన రైతులు ఈ ఖరీఫ్‌లో సైతం వాటికే మొగ్గు చూపుతున్నారు. మరోవైపు నాగార్జున సాగర్ డ్యాంలో పూర్తి స్థాయిలో నీరు ఉన్నప్పటికీ వీలైనంత త్వరగా వరి పంట పూర్తయితే కాలువ నీటితో ఇబ్బంది ఉండదన్న భావన రైతుల్లో ఉంది. దీంతో కాల వ్యవధి తక్కువున్న జేజీఎల్ వైపు మొగ్గుచూపుతున్నారు. ఇందులోని జేజీఎల్–1638 రకం కూడా కొందరు రైతులు సాగు చేస్తున్నారు.
జిల్లాకు 5,500 క్వింటాళ్ల
విత్తనాలు అవసరం
జిల్లాలో ఖరీఫ్–2025లో వరి సాధారణ సాగు విస్తీర్ణం 96,497 ఎకరాలుగా అధికారులు లెక్కించారు. ఇందుకు గాను సుమారు 22 వేల క్వింటాళ్ల విత్తనాలు అవసరమని గుర్తించి, ఏపీ సీడ్స్, ఇతర ప్రైవేట్ డీలర్ల ద్వారా అందుబాటులో ఉంచారు. ఇందులో జేజీఎల్–384 రకం వరి విత్తనాలు జిల్లాకు 5,500 క్వింటాళ్ల అవసరమవుతాయని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
వాతావరణ పరిస్థితులు, నీటి లభ్యత ఆధారంగా రైతులు గత రెండు మూడేళ్లుగా జేజీఎల్ రకం వరి సాగుకు మొగ్గు చూపుతున్నారు. దీనికి అనుగుణంగా ప్రభుత్వం విత్తనాలను సరఫరా చేయాల్సి ఉండగా ఆ దిశగా ప్రయత్నాలు చేయలేదు. గత ప్రభుత్వ హయాంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా అవసరమైన విత్తనాల రకాలను ముందుగానే గుర్తించి ఆదిశగా సరఫరా చేసేవారు. అయితే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రైతు భరోసా కేంద్రాలను నిర్వీర్యం చేయడంతో ఈ సమస్య వచ్చిందన్న వాదన రైతుల నుంచి వస్తోంది. ప్రభుత్వ నిర్లక్ష్యంలో రైతులు విత్తనాల కోసం ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తోంది. డిమాండ్‌ను చూపి వారు అధిక ధరలకు విక్రయిస్తున్నారని రైతులు వాపోతున్నారు. మరోవైపు జేజీఎల్‌కు సమానమైన ఇతర వరి రకాలను సాగు చేసి అంతే తక్కువ సమయంలో, సమాన దిగుబడి పొందవచ్చని వ్యవసాయశాఖ అధికారులు రైతులకు సూచిస్తున్నారు. ఎంటీయూ–1224, ఎన్‌ఎల్‌ఆర్–34449, కేఎన్‌ఎం–1638 రకాలను సాగు చేయాలని, ఆయా విత్తనాలు సరిపడా అందుబాటులో ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.
చీడపీడల నుంచి రక్షణ
రైతులకు లాభదాయకంగా ఉండటంతో జేజీఎల్ 384 రకం విత్తనం సాగుకు అధికంగా మొగ్గుచూపుతున్నారు. తెగుళ్లు, చీడపీడలను తట్టుకుంటుంది. దీంతో రైతులపై పెట్టుబడి భారం తగ్గుతుంది. స్వల్పకాలిక రకం కావడంతో 125 నుంచి 130 రోజులకే పంట చేతికొస్తుంది. నీటి ఎద్దడి కొంత తగ్గుతుంది. దీంతో పాటు మార్కెట్లో మంచి ధర లభిస్తోంది.
– ఎ అప్పారావు, వరి రైతు, నకరికల్లు
ప్రభుత్వం విఫలం
ఈ ప్రాంత రైతులు అధికంగా సాగు చేసే జేజీఎల్–384 రకం విత్తనాలను రైతులకు అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఆర్‌బీకే సెంటర్లలోనే రైతుల అవసరాలను తెలుసుకొని సరిపడా సరఫరా చేసేవారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఆర్‌బీకేల పేర్లను మార్చి నిర్వీర్యం చేసింది. దీంతో రైతులు విత్తనాలు, ఎరువుల కోసం ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తోంది. దీన్ని ఆసరా చేసుకొని అధిక ధరలకు విక్రయిస్తున్నారు. – అన్నెం పున్నారెడ్డి,
వైఎస్సార్‌సీపీ పల్నాడు జిల్లా రైతు విభాగం అఽధ్యక్షుడు

సాగులో వినూత్న ఒరవరి

సాగులో వినూత్న ఒరవరి

సాగులో వినూత్న ఒరవరి