
చవితి ఉత్సవాలకు అనుమతులు తప్పనిసరి
నరసరావుపేట: వినాయక ఉత్సవ నిర్వాహకులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సింగల్ విండో పద్ధతిలో తప్పకుండా అనుమతులు తీసుకోవాలని కలెక్టర్ పి.అరుణ్‌బాబు పేర్కొన్నారు. కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం వినాయక చవితి పండుగ ఉత్సవాలపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ప్రశాంతంగా, భక్తిపూర్వక వాతావరణంలో ఉత్సవాలు నిర్వహించుకోవాలని ఆయన సూచించారు. పర్యావరణానికి నష్టం వాటిల్లకుండా విగ్రహాలు ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. నిర్దేశిత నిమజ్జన ప్రదేశాల్లో ప్రణాళిక ప్రకారం విగ్రహ నిమజ్జనం జరిగేలా చూడాలని చెప్పారు. నిమజ్జన ప్రదేశాల్లో గజ ఈతగాళ్లను, అవసరమైన చోట బోట్లను అందుబాటులో ఉంచాలని సంబంధిత అధికారిని ఆదేశించారు. నిమజ్జన ప్రదేశంలో పబ్లిక్ అనౌన్స్‌మెంటు సిస్టంను ఏర్పాటు చేయాలని సూచించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. విగ్రహాలు ఏర్పాటు చేసిన చోట ముందస్తు చర్యల్లో భాగంగా విధిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. నిమజ్జన ప్రదేశాల్లో ఉత్సవ నిర్వాహకులు కాకుండా జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసిన సిబ్బంది ద్వారానే చేయాలని తెలిపారు.
271 మంది దరఖాస్తు
జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు మాట్లాడుతూ మండపాల అనుమతుల కోసం పోలీసు శాఖ నిర్వహిస్తున్న వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. జిల్లాలో ఇప్పటివరకు 271 మంది దరఖాస్తు చేసుకున్నారని ఆయన తెలిపారు. విగ్రహాలు ఏర్పాటు చేసే ప్రదేశాల్లో సమస్యలు లేకుండా చూడాలన్నారు. విగ్రహాల ఎత్తును బట్టి ఊరేగింపు జరిగే విధంగా వాహనాలు ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. ఎదురెదురుగా ఊరేగింపులు జరగకుండా చూడాలని చెప్పారు. డీజే సౌండ్ చుట్టుపక్కల వారికి అసౌకర్యం కలుగకుండా ఏర్పాటు చేసుకోవాలన్నారు. నిమజ్జనం రోజున ఆ ప్రదేశం దగ్గరలోని మద్యం షాపులు మూసి వేయనున్నట్లు చెప్పారు. నిమజ్జన ప్రదేశంలో క్రేన్, గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. వరదలు, వర్షాల దృష్ట్యా అనువైన నిమజ్జన ప్రదేశాలను నిర్ణయించనున్నట్లు వివరించారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఏకా మురళి, గురజాల ఆర్డీవో మురళీకృష్ణ, మునిసిపల్ కమిషనర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
అధికారుల సమీక్షలో కలెక్టర్, ఎస్పీ