
వరదకు కొట్టుకుపోయిన పెదమద్దూరు రోడ్డు
నిలిచిపోయిన అమరావతి– విజయవాడ రాకపోకలు
అమరావతి: కొద్ది రోజుల కింద వచ్చిన వరదకు పెదమద్దూరు రోడ్డు కొట్టుకుపోయింది. దీంతో అమరావతి నుంచి విజయవాడ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. పెదమద్దూరు వద్ద సుమారు అర కిలోమీటరు మేర పూర్తిగా ధ్వంసమైంది. వైకుంఠపురం, పెదమద్దూరు గ్రామాల ప్రజలతోపాటుగా అమరావతి నుండి విజయవాడకు వెళ్లే వారికి విజయవాడ నుంచి అమరావతి వచ్చే యాత్రికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. మండలంలోని అమరావతి నుండి వైకుంఠపురం పెదమద్దూరు వెళ్లాలంటే నరుకుళ్లపాడు, ఎండ్రాయి, చావపాడు మీదుగా సుమారు 12కిలోమీటర్లు చుట్టూ తిరిగి రావాల్సిందే. ప్రస్తుతం విజయ వాడ–అమరావతి బస్సులు పెదమద్దూరు వరకు వచ్చి అక్కడి నంండి వెనుతిరుగుతున్నాయి. గురువారం రాత్రి పెదమద్దూరు వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నప్పటికీ పోలీసు, రెవెన్యూ సిబ్బంది కాపాలా కాస్తున్న అమరావతికి చెందిన ట్రాక్టర్ అమరావతి నుంచి వైకుంఠపురం వైపు వెళ్ళటానికి ఈ రోడ్డు గుండా వచ్చి ప్రమాదవశాత్తు వాగులో పడి వరదనీటిలో మునిగిపోయింది. ట్రాక్టర్ డ్రైవర్‌కు ప్రాణాపాయం తప్పింది. వెంటనే ప్రజాప్రతినిధులు, సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి రోడ్డుకు కనీస మరమ్మతులు చేయాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.