
తిరంగా.. ఎగిరె సగర్వంగా..
నరసరావుపేటలో ఉత్సవాల్లో పాల్గొన్న మంత్రి నాదెండ్ల మనోహర్ పారిశ్రామికంగా, పర్యాటకంగా జిల్లా అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని వెల్లడి ఆకట్టుకున్న విద్యార్థుల ప్రదర్శనలు
సాక్షి, నరసరావుపేట / నరసరావుపేట రూరల్: నరసరావుపేట రూరల్ మండలం లింగంగుంట్లలోని జిల్లా కలెక్టరేట్ వద్ద పరేడ్ గ్రౌండ్‌లో శుక్రవారం 79వ స్వాతంత్య్ర దిన వేడుకలు ఘనంగా జరిగాయి. జాతీయ పతాకాన్ని ముఖ్య అతిథిగా మంత్రి నాదెండ్ల మనోహర్ ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. స్వాతంత్య్రం సిద్ధించటానికి కృషి చేసిన సమరయోధుల సేవలను కొనియాడారు. అమరవీరులకు నివాళులు అర్పించారు. సమరయోధుడి కుమారుడు రామకృష్ణారెడ్డి, రమాదేవి దంపతులతోపాటు దేశం కోసం ప్రాణాలర్పించిన క్రోసూరు మండలం పీసపాడుకు చెందిన అమర జవాన్ నేతాజీ తల్లిదండ్రులు ఎన్.భాస్కరరావు దంపతులు, రొంపిచర్ల మండలం రామిరెడ్డిపాలెంకు చెందిన రమకాంత్‌రెడ్డి భార్య సావిత్రి సత్కారం పొందిన వారిలో ఉన్నారు.
సమగ్ర ప్రగతికి చర్యలు
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... పల్నాడు జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. మహాత్ములు కలలుగన్న స్వాతంత్య్ర ఫలాలు, రాజ్యాంగ స్ఫూర్తితో అందరికి సమాన అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు. పేదరిక నిర్మూలనకు పీ–4 కింద కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. వ్యవసాయరంగానికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందన్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. వసతి గృహాలను మెరుగు పరుస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులకు సౌకర్యాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతినెలా ఒకటో తేదీన ఇంటి వద్దే పింఛన్ నగదు అందిస్తున్నట్లు గుర్తుచేశారు. సీ్త్ర శక్తి పేరుతో ఐదు రకాల బస్సులలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నామన్నారు. జిల్లాలో అన్నా క్యాంటీన్ల ద్వారా నిత్యం 8,546 మందికి భోజనం అందిస్తున్నామని తెలిపారు. జిల్లా అభివృద్ధికి కృషి చేస్తున్న ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బందికి మంత్రి అభినందనల తెలిపారు. జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు, ఎస్పీ కంచి శ్రీనివాసరావు, జిల్లా అదనపు కలెక్టర్ సూరజ్ గనోరే, అదనపు ఎస్పీ జేవీ సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా వ్యాప్తంగా ఘనంగా స్వాతంత్య్ర దిన వేడుకలు
పోలీసు శాఖ ఆధ్వర్యంలో జాగిలాల ప్రదర్శన ఆహూతులను ఆకట్టుకుంది. ప్రభుత్వ శాఖల శకటాలు అలరించాయి. పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు ప్రత్యేకంగా నిలిచాయి. లింగంగుంట్ల శంకరభారతీపురం జెడ్పీ హైస్కూల్, విప్పర్ల రెడ్డిపాలెం, క్రోసూరు మోడల్స్ స్కూల్స్ విద్యార్థులు దేశభక్తి గేయాలకు నృత్యాలు చేశారు. శావల్యాపురం జెడ్పీ హైస్కూల్ విద్యార్థుల కోలాటం ప్రదర్శన ఆకట్టుకుంది. ఎత్తిపోతల గిరిజన రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థినులు ప్రదర్శించిన కోయ సంప్రదాయ నృత్య రూపకం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో స్టాళ్లు ఏర్పాటు చేశారు. వీటిని మంత్రి, అధికారులు తిలకించారు. నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు, డీఆర్‌వో మురళి, ఆర్‌డీవో మధులత తదితరులు పాల్గొన్నారు.

తిరంగా.. ఎగిరె సగర్వంగా..

తిరంగా.. ఎగిరె సగర్వంగా..