
పేదింటిపైనా కూటమి కక్ష
దాదాపు 6 వేల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ సుమారు రూ.50 కోట్లతో కాలనీలో పలు వసతులు ఇళ్లు కట్టుకుని నివాసం ఉంటున్న వెయ్యి కుటుంబాలు కూటమి అధికారంలోకి వచ్చాక కాలనీవాసులపై కక్ష సాధింపు 14 నెలలుగా ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయని ప్రభుత్వం మౌలిక సదుపాయాలు లేక స్థానికులకు తీవ్ర ఇబ్బందులు
వైఎస్సార్‌సీపీ హయాంలో ఏర్పాటైన జగనన్న కాలనీ అభివృద్ధిపై చిన్నచూపు
పేదలందరికీ సొంత గూడు కల్పించాలని నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భావించారు. ఐదేళ్లలో లక్షల మందికి ఇళ్ల పట్టాలు మంజూరు చేశారు. ఇళ్ల నిర్మాణాలు కూడా ప్రారంభం అయ్యాయి. ఇళ్లు కాదు.. నూతనంగా ఊళ్లే ఏర్పాటయ్యాయి. నరసరావుపేటలోనూ వైఎస్సార్ జగనన్న కాలనీ వెలిసింది. 6 వేల మందికి స్థలాలు కేటాయించగా, వెయ్యి కుటుంబాలు ఇళ్లు కట్టుకుని నివాసం ఉంటున్నాయి. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక కనీస అభివృద్ధి లేదు. సౌకర్యాలు కల్పించకపోవడంతో పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
నరసరావుపేట రూరల్: నరసరావుపేట మున్సిపాలిటీ పరిధిలోని పేదల కోసం ఉప్పలపాడు రోడ్డులో వైఎస్సార్ జగనన్న కాలనీని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేశారు. పట్టణంలో నివసిస్తూ సొంత ఇళ్లు లేని 6 వేల మందికి పట్టాలు మంజూరయ్యాయి. లింగంగుంట్ల, ఇక్కుర్రు పరిధిలో 150 ఎకరాలను దీనికోసం సేకరించారు. కేంద్ర, రాష్ట్ర గృహనిర్మాణ పథకం ద్వారా పేదలు కూడా ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.
రూ.కోట్ల వ్యయంతో...
పేదల సొంతింటి కల తీర్చేందుకు నాటి వైఎస్ జగన్ ప్రభుత్వం ఎంత ఖర్చయినా వెనుకాడలేదు. పట్టణానికి సమీపంలోని అత్యంత విలువైన 150 ఎకరాల భూమిని దాదాపు రూ.30 కోట్లు ఖర్చు చేసి రైతుల నుంచి సేకరించారు. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి దీనికోసం తీవ్రంగా శ్రమించారు. రైతులతో పలు దఫాలుగా చర్చించి, ఒప్పించారు. పట్టాల పంపిణీ అనంతరం కాలనీలో మౌలిక సదుపాయాలపై దృష్టి సారించారు. విద్యుత్ సబ్‌స్టేషన్ ఏర్పాటు చేయించారు. ఈ వసతికి దాదాపు రూ.4 కోట్లు ఖర్చు చేశారు. వినుకొండ–నరసరావుపేట హైవే నుంచి కాలనీ వరకు ప్రధాన రోడ్డును రూ.కోటితో నిర్మింపజేశారు. కాలనీలోని అంతర్గత రోడ్లు కోసం రూ.కోటి ఖర్చు పెట్టారు. ప్రభుత్వం సదుపాయాలు కల్పిస్తుందన్న నమ్మకంతో దాదాపు వెయ్యి కుటుంబాలు కాలనీలో గృహప్రవేశాలు చేశాయి.
కూటమి పాలకుల దగా
ఎన్నికల తర్వాత కూటమి అధికారంలోకి రావడంతో కాలనీ వాసులకు కష్టాలు ప్రారంభమయ్యాయి. గృహనిర్మాణాల ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన పైలాన్‌ను దుండగులు ధ్వంసం చేశారు. ఇక అభివృద్ధి పనులు మచ్చుకై నా మొదలు పెట్టలేదు. దాదాపు 2 వేల ఇళ్లు నిర్మాణ దశలో ఉన్నాయి. పాలకుల నిర్లక్ష్యంతో వాటి నిర్మాణం మధ్యలోనే నిలిచిపోయింది.

పేదింటిపైనా కూటమి కక్ష

పేదింటిపైనా కూటమి కక్ష