
వైభవంగా కృష్ణాష్టమి వేడుకలు
వెన్నముద్దల బాలకృష్ణునికి ప్రత్యేక పూజలు
నరసరావుపేట ఈస్ట్: శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు జిల్లా వ్యాప్తంగా శనివారం వైభవంగా జరిగాయి. ముఖ్యంగా వైష్ణవాలయాలు ఉదయం నుంచే భక్తులతో కిటకిటలాడాయి. హరే కృష్ణ ... హరే కృష్ణ ... కృష్ణ కృష్ణ ... హరే హరే అంటూ భక్తులు కృష్ణ నామస్మరణ చేశారు. చిన్నారులు రాధాకృష్ణుల వేషధారణలో అలరించారు. సామూహిక గీతా పారాయణాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. బరంపేటలోని శ్రీరాధా గోవింద చంద్ర మందిరం ఇస్కాన్‌లో జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక అభిషేకాలు, పూజలు, అలంకరణలు చేశారు. అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు. సాయంత్రం ఉట్లోత్సవం నిర్వహించారు.
భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
యడ్లపాడు: యడ్లపాడు మండలంలోని చెంఘీజ్‌ఖాన్‌పేటలో 363 ఏళ్ల నాటి శ్రీరాజ్యలక్ష్మి సమేత వేణుగోపాలస్వామి ఆలయంలో కొలువున్న వెన్నముద్దల బాలకృష్ణునికి శనివారం విశేష పూజలు జరిగాయి. ఆలయ అర్చకులు పరుచూరి సత్యన్నారాయణ చార్యులు, రాఘవేంద్ర, జితేంద్ర ఆధ్వర్యంలో స్వామికి పూజలు చేశారు. బాలకృష్ణుని నిజరూపదర్శనం చేసుకున్న భక్తులు పులకించిపోయారు. అనంతరం నరసరావుపేట భజన సమాజం విశేష భజన కార్యక్రమాలు నిర్వహించగా, ఆలయ ప్రాంగణం కళకళలాడింది. ఏడాదికి ఒకసారి భక్తులకు అందించే మోడికారంతో పాటు స్వామివారి పూజల్లో ఉంచిన వెన్న, ఇతర ప్రసాదాలను పంపిణీ చేశారు. రాత్రి 7 గంటలకు తులువ వంశీయులచే ఆలయం వద్ద ఉట్టి మహోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈఓ నెమలిరెడ్డి భక్తులకు అవసరమైన ఏర్పాట్లను పర్యవేక్షించారు.
ఆలయాలు కిటకిట
సత్తెనపల్లి: పట్టణంలోని ఆలయాల్లో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వడవల్లి ఆంజనేయస్వామి దేవాలయం ఎదుట గల శ్రీకృష్ణుడి దేవాలయం, ఐదు లాంతర్ల సెంటర్‌లోని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాలస్వామి దేవాలయం, గుంటూరు రోడ్‌లోని అయ్యప్ప స్వామి దేవాలయంలో వేడుకలు భక్తిశ్రద్ధలతో చేశారు. పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. మనసారా స్వామి వారిని దర్శనం చేసుకున్నారు. ఉట్టి కొట్టే కార్యక్రమం ఉత్సాహంగా నిర్వహించారు. వడ్డవల్లి ఆంజనేయ స్వామి దేవాలయ ఎదుట గల శ్రీకృష్ణుడి దేవాలయంలో నిర్వహించిన వేడుకలకు సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ హాజరయ్యారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు.

వైభవంగా కృష్ణాష్టమి వేడుకలు

వైభవంగా కృష్ణాష్టమి వేడుకలు