
ఆటోవాలా బతుకు డీలా
‘ఉచిత బస్సు ప్రయాణం’పై ఆందోళన ప్రభుత్వ నిర్ణయంతో జీవనోపాధికి గండి ‘వాహన మిత్ర’తో ఆదుకోవాలని డిమాండ్
ముప్పాళ్ళ: కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఆటోవాలాలు ఆందోళన చెందుతున్నారు. సీ్త్ర శక్తి పేరుతో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పథకం ప్రారంభించడంతో జీవనోపాధికి గండి పడుతోంది. అప్పులు చేసి ఆటోలు కొనుగోలు చేసిన తాము ఉపాధి కోల్పోయి రోడ్డున పడటం ఖాయమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం కనీసం చర్చలు జరపడం లేదన్నారు. ‘వాహన మిత్ర’ తరహాలో తమకు ఆర్థికసాయం అందించాలని డిమాండ్ చేస్తున్నారు.
కూటమి ప్రభుత్వం మొండిచేయి
నెలకు వాహన కిస్తీ, ఇంధనం, నిర్వహణకోసం దాదాపు రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు ఖర్చు అవుతోందని డ్రైవర్లు చెబుతున్నారు. రవాణాశాఖ అధికారుల తనిఖీలో నమోదయ్యే కేసులు, ప్రతి ఏడాది బ్రేక్ ఫిట్‌నెస్ కోసం ఖర్చులు అదనమని పేర్కొన్నారు. అధికారంలోకి వస్తే ఆటో కార్మికులకు ఏటా రూ.15 వేలు ఇస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. సంక్షేమ బోర్డు ఏర్పాటు, తక్కువ వడ్డీకి రుణాలు ఇస్తామని నమ్మ బలికింది. అధికారం చేపట్టి 14 నెలలు కావస్తున్నా ఇవేమీ అమలు కాలేదు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఆటో డ్రైవర్లకు వాహనమిత్ర పథకం ద్వారా ఏటా రూ.10 వేల సాయం అందించారు. వాహనాల తనిఖీలు, అక్రమ కేసులు నమోదు లేకుండా అండగా సర్కారు నిలిచింది. కానీ, వాహన ఫిట్‌నెస్ సర్టిఫికెట్ మంజూరును ప్రయివేటు ఏజన్సీలకు అప్పగించేలా కూటమి సర్కారు చర్యలు చేపట్టింది. జీఓ నెంబర్ 21 పేరుతో ట్యాక్స్‌లు, జరిమానాలు భారీగా పెంచేందుకు సిద్ధం అవుతోంది.