
మాజీ సర్పంచ్‌పై కానిస్టేబుల్ దాడి
బెల్లంకొండ: వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో బైక్ ఆపలేదనే కోపంతో మాజీ సర్పంచ్‌పై ఓ కానిస్టేబుల్ లాఠీ ఝులిపించారు. ఈ ఘటన శనివారం సాయంత్రం మండలంలోని నాగిరెడ్డిపాలెం సమీపంలో చోటు చేసుకుంది. బాధితుడు నాగిరెడ్డిపాలెం మాజీ సర్పంచ్ కొజ్జా శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం.. బెల్లంకొండ క్రాస్ రోడ్డు నుంచి బైక్‌పై నాగిరెడ్డి పాలెం వస్తుండగా గంగమ్మ గుడి సమీపంలో కానిస్టేబుళ్లు వాహనాల తనిఖీ చేపడుతున్నారు. బైక్ ఆపకుండా ముందుకు వెళ్లడంతో తనిఖీ చేస్తున్న కానిస్టేబుళ్లలో ఒకరు శ్రీనివాసరావుపై లాఠీ విసిరారు. దీంతో ముఖంపై గాయమై రక్తస్రావం అయింది. వెంటనే ఊర్లోకి గాయంతో వచ్చిన శ్రీనివాసరావును చూసి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు నాగిరెడ్డిపాలెం ప్రధాన రహదారిపై నిరసనకు దిగారు. రెండు గంటలపాటు రోడ్డుపై బైఠాయించారు. దీంతో విషయం తెలుసుకున్న క్రోసూరు, సత్తెనపల్లి సీఐలు ప్రత్తిపాటి సురేష్, కిరణ్‌లు నాగిరెడ్డిపాలెం వచ్చి బాధితుడికి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. కాగా దాడి చేసిన కానిస్టేబుల్ రావాలని, కొట్టడానికి గల కారణం చెప్పాలని బాధితుడి కుటుంబ సభ్యులు భీష్ముంచుకుని కూర్చున్నారు. వాహనాల రాకపోకలు నిలిచిపోయాయని, పోలీస్ స్టేషన్లో మాట్లాడదామని సీఐలు సర్ది చెప్పారు. దీంతో బాధితుడు కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. దాదాపుగా గంటపాటు వారితో పోలీసులు మంతనాలు సాగించారు. అనంతరం బాధితుడిని వైద్యశాలకు పంపారు. కాగా ఘటనపై పెదకూరపాడు సీఐ సురేష్‌ని వివరణ కోరగా కానిస్టేబుళ్లు ఎవరిపై దాడి చేయలేదని, బైక్ ఆపమని చెప్పగా, శ్రీనివాసరావు ఆపకుండా వేగంగా వెళ్లిపోయినట్లు పేర్కొన్నారు. బాధితుడిని, సిబ్బందిని విచారించి పూర్తి వివరాలు వెల్లడిస్తామని సీఐ తెలిపారు.
తనిఖీలలో బైక్ ఆపలేదనే కోపంతో నాగిరెడ్డిపాలెం మాజీ సర్పంచ్‌పై లాఠీ విసిరేసిన కానిస్టేబుల్ బాధితుడి తలకు గాయమై తీవ్ర రక్తస్రావం దాడికి నిరసనగా రహదారిపై బాధితుడి కుటుంబ సభ్యుల బైఠాయింపు

మాజీ సర్పంచ్‌పై కానిస్టేబుల్ దాడి