
దళిత, గిరిజనులకు నేటికీ స్వాతంత్య్రం రాలేదు
మంగళగిరి టౌన్: భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 78 సంవత్సరాలు అయినా నేటికీ దళిత, గిరిజనులను స్వాతంత్య్రం రాలేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు పేర్కొన్నారు. మంగళగిరి నగర పరిధి టిప్పర్ల బజారులోని కేవీపీఎస్ (కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం) గుంటూరు జిల్లా 6వ మహాసభ ఆదివారం రాత్రి నిర్వహించారు. సామాజిక న్యాయం అంశంపై జరిగిన సెమినార్‌లో శ్రీనివాసరావు మాట్లాడుతూ దళితులు ఎదుర్కొంటున్న ఆర్థిక రాజకీయ సమస్యలపై రాజీలేని పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లా దళిత ఉద్యమానికి కంచుకోట అని అన్నారు. స్వాతంత్య్రానికి పూర్వమే గుంటూరు జిల్లాలో అంటరానితనానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేసిన ఘటనలు ఎన్నో ఉన్నాయని గుర్తుచేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అసమానతలు, దళితులపై దాడులు నిత్యకృత్యమయ్యాయన్నారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ఉన్నప్పటికీ దళిత, గిరిజనులకు న్యాయం జరగడం లేదన్నారు. ఈ చట్టం అమలు చేయడంలో పాలకులు నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారని విమర్శించారు. డాక్టర్ అంబేడ్కర్ రాసిన రాజ్యాంగాన్ని అమలు చేసే పరిస్థితుల్లో పాలకులు లేరన్నారు. గిరిజన ప్రాంతాల్లో అదానీకి భూములు అప్పగించడానికి కుట్రలు జరుగుతున్నాయని మండిపడ్డారు. పీ–4 పథకం ఓ చెత్త పథకమన్నారు. అనంతరం 15 మందితో కూడిన కేవీపీఎస్ నూతన కమిటీని ఎన్నుకున్నారు. గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా వై.కమలాకర్, జిల్లా ప్రధాన కార్యదర్శిగా నవీన్ ప్రకాష్, ఉపాధ్యక్షులుగా వెంకటేశ్వర్లు, లూదర్ పాల్, సహాయ కార్యదర్శులుగా దుర్గారావు, రమేష్‌లను ఎన్నుకున్నారు.