
ఓబీసీ బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలి
నెహ్రూనగర్: దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఓబీసీ బ్యాక్‌లాగ్ పోస్టులను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని అఖిల భారత ఓబీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు అంగిరేకుల వరప్రసాద్ యాదవ్ కోరారు. ఈ మేరకు సోమవారం ఢీల్లీలోని జాతీయ బీసీ కమిషన్ కార్యాలయంలో చైర్మన్ హన్స్‌రాజ్ గంగరామ్ అహీర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వరప్రసాద్ యాదవ్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 63 కేంద్ర ప్రభుత్వ శాఖల్లో బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీకి తగిన చర్యలు తీసుకోవడంతో పాటు, విద్యా, ఉపాధి రంగాల్లో ఓబీసీలకు రిజర్వేషన్ల పరిరక్షణకు తగిన చొరవ చూపాలన్నారు. గత 3, 4 సంవత్సరాలుగా వివిధ రాష్ట్రాలలో నీట్ సీట్ల భర్తీ విషయంతో తీవ్ర అన్యాయం జరుగుతుందని దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలన్నారు. దేశంలో 52శాతానికి పైగా జనాభా కలిగిన ఓబీసీల సాధికారిత కోసం ఓబీసీ సబ్ ప్లాన్ చట్టాన్ని రూపొందించేందుకు కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని సూచించారు. కేంద్రంలో ఓబీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయడంతో పాటు ఓబీసీల్లోని అన్ని కులాల విద్యార్థులకు ఓవర్సీస్ స్కాలర్‌షిప్ పథకం అమలు చేసేలా చూడాలని కోరారు. ఆయనవెంట ఏపీ బొందిలి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుజాన్ సింగ్, ఓబీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి కృష్ణంరాజు, సంఘ నాయకులు ఉరిటి అశోక్‌కుమార్, ముంగమూరి హైమారావు, ఖాసీం పాల్గొన్నారు.