
పొగాకు కొనాలని రైతుల ధర్నా
నరసరావుపేట రూరల్: రైతుల వద్ద ఉన్న పొగాకు నిల్వలను ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈపూరు మండలం అగ్నిగుండాల గ్రామానికి చెందిన రైతులు సోమవారం కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఐటీసీ సంస్థ సహకారంతో గత మూడు సంవత్సరాలుగా వైట్‌బర్లీ పొగాకు పంటను సాగు చేస్తున్నట్టు రైతులు తెలిపారు. గత ఏడాది పంట చేతికొచ్చే సమయానికి ఐటీసీ సంస్థ పంట కొనుగోలు చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డామని వివరించారు. ఈ ఏడాది పొలాలను కౌలుకు తీసుకొని షెడ్లు నిర్మించి పంట సాగుకు సిద్ధమయ్యామని తెలిపారు. ప్రభుత్వంతో పాటు ఐటీసీ సంస్థ పొగాకు సాగుచేయొద్దంటూ రైతులను అడ్డుకుంటుందని తెలిపారు. దీనివలన పెట్టుబడి పెట్టిన రైతులు తీవ్రంగా నష్టపోతారన్నారు. రైతుల వద్ద ఉన్న పొగాకు నిల్వలను వెంటనే కొనుగోలు చేయడంతో పాటు ఈ ఏడాది పంట సాగుకు ఐటీసీ సంస్థ ద్వారా బాండ్లు ఇప్పించి సహకరించాలని కోరారు. ధర్నా అనంతరం జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబుకు వినతిపత్రం అందజేశారు. రైతుల వద్ద ఉన్న పొగాకును కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ హామీ ఇచ్చారు. పీడీఎం నాయకులు వై.వెంకటేశ్వరరావు, గిరిజన సంఘ నాయకులు వి.కోటనాయక్, పీడీఎం జిల్లా అద్యక్షుడు షేక్ మస్తాన్‌వలి, కార్యదర్శి జి.రామకృష్ణ, రైతులు వెంకటకోటిరెడ్డి, దూదేకుల చిరంజీవి, గంటా నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.