
ఎద్దువాగు
ఉధృతంగా
నకరికల్లు నుంచి శివాపురం తండా, ఉదయ్‌నగర్‌లకు నిలిచిన రాకపోకలు
నకరికల్లు: మండల కేంద్రమైన నకరికల్లు నుంచి శివాపురం తండా, ఉదయ్‌నగర్ కాలనీలకు వెళ్లే రోడ్డుపైకి వాగునీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. గత రెండుమూడు రోజులుగా కురుస్తున్న భారీవర్షాలకు నకరికల్లు రిజర్వాయర్‌కు ఆనుకొని ఉన్న ఎద్దువాగు పొంగి ప్రవహిస్తుంది. స్థానిక చెరువు వద్ద నుంచి ఇనిమెట్ల, ఉప్పలపాడు వరకు ప్రవహించే ఈ వాగు పొంగినప్పుడల్లా రాకపోకలు నిలిచిపోతున్నాయి. ఇటీవల కురుస్తున్న వర్షాలకు నకరికల్లు నుంచి శివాపురం తండా, ఉదయ్‌నగర్ కాలనీలకు వెళ్లే రోడ్డుపైకి నడుములోతు నీరు వచ్చిచేరడంతో రాకపోకలు స్థంభించిపోయాయి. వాహనదారులు నర్శింగపాడు మీదుగా నకరికల్లు చేరుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పాదచారులు చేసేదిలేక నడుములోతు వాగులో నుంచి నడుచుకుంటూ వస్తున్నారు. గతంలో కూడా భారీవర్షాలకు రోడ్డుపై వాగునీరు చేరడంతో రాకపోకలు స్థంభించిపోయాయి. రెండుగ్రామాల ప్రజల సమస్యలు పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నా అధికారులు చూస్తూ మిన్నకుండిపోతున్నారు. వాగును పరిశీలించిన ఏఐకెఎఫ్ పల్నాడు జిల్లా కార్యదర్శి తూమాటి మణికంఠ మాట్లాడుతూ వాగుపై కల్వర్టు నిర్మాణం చేసి రెండుగ్రామాల ప్రజల అవస్థలు తీర్చాలని కోరారు.
పీసపాడు వద్ద...
పీసపాడు(క్రోసూరు): ఎగువన బెల్లంకొండ, పిడుగురాళ్ల వైపు కురిసిన భారీ వర్షాలకు వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. మండలంలోని పీసపాడు గ్రామంలో ఎద్దువాగు బ్రిడ్జి ఎత్తులో నీళ్లు పొంగి ప్రవహిస్తున్నాయి. వరద నీరు జోరుగా ఇతర అందుకూరు, బాలెమర్రు, బయ్యవరం గ్రామాల వాగులు గుండా ప్రవహించి కృష్ణానదిలో కలుస్తాయి. 2016, 2017లో పీసపాడు ఎద్దువాగు మీద ఉన్న హైలెవల్ బ్రిడ్జి మీదుగా వరద పొంగింది.