
ఈ–పంట నమోదు ప్రారంభం
సత్తెనపల్లి: జిల్లా వ్యాప్తంగా 330 రైతు సేవా కేంద్రాల పరిధిలో ఖరీఫ్ సీజన్‌కు అవసరమైన ఈ–పంట నమోదు ప్రారంభమైంది. అధికారులు గ్రామాల్లోకి వచ్చి పంట వివరాలు నమోదు చేస్తున్నారు. రైతులకు ముందస్తు సమాచారం కూడా ఇవ్వాల్సి ఉంది. వెబ్‌ల్యాండ్ ఆధారంగా జిల్లాలో 10.06 లక్షల ఎకరాల్లో భూములు ఉండగా 99.96 ఎకరాల్లో పంటల సాగు అవుతున్నట్లు రికార్డుల్లో ఉంది. దీనిలో ఇప్పటివరకు 3,985 ఎకరాల్లో ఈ–పంట నమోదు చేశారు. వ్యవసాయ పంటలకు మండల వ్యవసాయ అధికారి, ఉద్యాన పంటలకు ఉద్యాన శాఖ అధికారి, ప్రభుత్వ/వ్యవసాయతర భూములకు తహసీల్దారులకు నమోదు పర్యవేక్షణ బాధ్యతను అప్పగించారు. ఇప్పటివరకు గ్రామాల్లో సాగు చేసే పంటలను మాత్రమే ఈ–పంట నమోదు చేస్తుండే వారు. అయితే కొత్తగా ప్రభుత్వభూములు, వ్యవసాయేతర భూములు, బీడు భూములు, పశువుల పాకలను కూడా ఈ–పంట నమోదు చేయాలన్న ఆదేశాలు వ్యవసాయ అధికారులకు అందాయి. దీంతో ఏయే పంటల సాగు చేస్తున్నారనే వివరాలతో పాటు అదనంగా వ్యవసాయేతర భూములు కూడా నమోదు చేయనున్నారు.
షెడ్యూల్ ఇలా..
పంట నమోదుకు గడువు : సెప్టెంబర్ 15 వరకు
గ్రామ సభల నిర్వహణ : సెప్టెంబర్ 19–24
వరకు
ఫిర్యాదుల స్వీకరణ : 25 నుంచి 28 వరకు
తుది జాబితా ప్రచురణ : సెప్టెంబర్ 30