
ప్రజాస్వామ్యం అపహాస్యం
పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల తీరుపై డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ధ్వజం
నరసరావుపేట రూరల్: రాష్ట్రంలో జెడ్పీటీసీ ఉప ఎన్నికలు జరిగిన తీరు ప్రజాస్వామ్యానికి మాయనిమచ్చగా మిగులుతుందని వైఎస్సార్ సీపీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు. పులివెందులలో టీడీపీని గెలిపించడానికి ఎన్నికల సంఘం, పోలీసు శాఖ ఇంతగా దిగజారాలా అని ప్రశ్నించారు. దేశ చరిత్రలో ఇంత దారుణంగా ఎన్నికల జరిగిన ఘటనలు లేవన్నారు. స్థానిక గుంటూరు రోడ్డులోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు.. పోలింగ్ కేంద్రాలు రెండు కిలోమీటర్లలోపు ఉండాలని ఎన్నికల సంఘం నిబంధనలు ఉన్నప్పటికీ నాలుగు కిలోమీటర్ల దూరంలోని మరో గ్రామంలోకి మార్చారన్నారు. దాదాపు నాలుగు వేల మంది ఓటింగ్‌లో పాల్గొనకూడదనే కుట్రతోనే ఎన్నికల కమిషన్ ఈ చర్యకు పాల్పడిందన్నారు. నిస్వార్ధంగా, నిష్పక్షపాతంగా పనిచేయాల్సిన ఎన్నికల సంఘం అధికారపార్టీకి వత్తాసు పలకడం దారుణమన్నారు.
ప్రజలు ఓటు వేయరని తెలిసే అక్రమాలు
తెల్లవారుజామున కడప ఎంపీ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి, సతీష్‌రెడ్డిలను అరెస్ట్ చేసిన పోలీసులు మంత్రి రాంప్రసాద్‌రెడ్డి, ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, బీటెక్ రవిలను స్వేచ్ఛగా తిరగనిచ్చారన్నారు. వారు గ్రామాల్లో తిరుగుతూ పోలింగ్‌బూత్‌లలోకి ప్రవేశించి భయబాంత్రులకు గురిచేసారని తెలిపారు. ఒంటిమిట్ట పరిధిలోని పోలింగ్‌బూత్‌లో రాంప్రసాద్‌రెడ్డి వీరంగం సృష్టించి వైఎస్సార్ సీపీ పోలింగ్ ఏజెంట్‌పై దాడికి పాల్పడ్డారన్నారు. జమ్మలముడుగు, ఇతర నియోజకవర్గాల నుంచి దొంగ ఓటర్లను తీసుకువచ్చి ఓటింగ్ జరిపించి ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేశారన్నారు. వైఎస్సార్ సీపీ ఏజెంట్లను పోలీసులే బయటకు పంపడం విడ్డూరన్నారు. ఇంతకన్నా జెడ్పీటీసీ సభ్యులుగా టీడీపీ వ్యక్తులను ప్రకటించుకుంటే సరిపోయేదన్నారు. పులివెందుల ప్రజలు తమకు ఓట్లు వేయరని అంచనాకు వచ్చిన కూటమి నాయకులు ఈ అక్రమాలకు పాల్పడ్డారని తెలిపారు. ఎన్నికల సంఘంపై దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్న సమయంలో రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ వ్యవహరించిన తీరు బాధకరమని తెలిపారు. ప్రజాస్వామ్యవాదులు ఈ తరహా ఎన్నికల నిర్వహణను వ్యతిరేకించాలని కోరారు.