● రూ.30 వేల నగదు దోపిడీ
రాయగడ: జిల్లాలో దుండగులు రెచ్చిపోతున్నారు. ఇంట్లోకి చొరబడి ఒక ఉపాధ్యాయుడిని తుపాకీతో బెదిరించడంతో పాటు కత్తితో దాడిచేసి రూ.30 వేల నగదు దోచుకెళ్లారు. ఈ ఘటన జిల్లాలో బిసంకటక్‌లోని స్థానిక హనుమాన్ మందిరం వెనుక ప్రాంతంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కళింగ మోడల్ రెసిడెన్సియల్ పాఠశాలలో హిందీ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న గౌరీశంకర్ సాహు పాఠశాల నుంచి శుక్రవారం సాయంత్రం ఇంటికి చేరుకుని లోపలికి వెళ్తుండగా ముసుగులు ధరించిన ఇద్దరు దుండగులు బలవంతంగా ఇంట్లోకి చొరబడ్డారు. అతడిని తుపాకీతో బెదిరించి, కత్తితో దాడిచేసి ఆయన వద్దనున్న రూ.30 వేల నగదును అపహరించారు. అనంతరం ఇంటి బయట నుంచి తలుపు గడియ పెట్టి అక్కడినుంచి పరారయ్యారు. దండగుల దాడిలో తీవ్రంగా గాయపడిన ఉపాధ్యాయుడు కేకలు వేయడంతో అప్రతమత్తమైన బంధువులు ఆయనను రక్షించి చికిత్స నిమిత్తం స్థానిక ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. ఆయన తలకు తీవ్రగాయమైనట్లు సమాచారం. విషయం తెలుసుకున్న బిసంకటక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. పట్టపగలే చోటు చేసుకున్న ఈ దోపిడీ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
జిరంగో నదిలో వ్యక్తి గల్లంతు
పర్లాకిమిడి: జిల్లాలోని రాయఘడ బ్లాక్ జిరంగో గ్రామం వద్ద నదిలో శుక్రవారం స్నానానికి వెళ్లి ఒక వ్యక్తి వరద నీటిలో కొట్టుకుపోయారు. గల్లంతైన వ్యక్తి జిరంగో గ్రామానికి చెందిన పితాంబర బడియా సాహు(61)గా భావిస్తు న్నారు. సాయంత్రం అయినా పితాంబర బడియా ఇంటికి రాకపోయేసరికి వారి బంధువులు నది వద్దకు వెళ్లగా తువ్వాలు, చెప్పులు, ఇతర సామగ్రి నది ఒడ్డున ఉన్నాయి. దీంతో ఆయన నదిలో కొట్టుకుపోయినట్లు భావిస్తున్నా రు. ఆయన భార్య, అన్నదమ్ములు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. జిరంగో నది వద్దకు ఓడ్రాఫ్, అగ్నిమాపక సిబ్బంది వచ్చి గాలింపు చర్యలు చేపట్టారు. ఎంత గాలించినా చీకటి పడడంతో నదిలో తప్పిపోయిన ఆయన జాడ తెలియరాలేదు. దీంతో పితాంబర బడియా సాహు కుటుంబ సభ్యులు విచారిస్తున్నారు. శనివారం ఉదయం కూడా అగ్నిమాపక దళం విచ్చేసి జిరంగో నదిలో వెదుకుతున్నారు.
అనాథలను రక్షించిన అధికారులు
పర్లాకిమిడి: అర్నబ్ తుపాను ఫలితంగా జిల్లాలోని రాయఘడ బ్లాక్ ఘోఠెయి గ్రామంలో ముగ్గురు బాలబాలికలు అనాథలుగా మిగిలిపోయారు. కన్నతల్లి కొద్దిరోజుల క్రితం అనారోగ్యంతో చనిపోగా.. తండ్రి ఇద్దరు ఆడపిల్లలు, ఒక కుమారుడిని వదిలి ఎటో వెళ్లిపోయాడు. అయితే వారుంటున్న పూరిల్లు ఇటీవల తుపానుకు కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుసుకుని రాయఘడ బ్లాక్ సీడీపీవో బి.కోమలాంగి, ఇతర అధికారులు జిల్లా అధికార యంత్రాంగానికి తెలియజేశారు. జిల్లా అధికారులు, జిల్లా శిశు సురక్షా సమితి అధికారులు, చైల్డ్‌లైన్ కార్యకర్తలు విచ్చేసి వారిని రక్షించి పర్లాకిమిడిలో బాలాశ్రమంకు తరలించారు. శిశు సంక్షేమ శాఖ అధికారులు వారికి దుప్పట్లు, ఆశ్రయం కల్పించి పాఠశాలల్లో చేర్పిస్తామని సీడబ్ల్యూసీ చైర్మన్ వెల్లడించారు.
రాజధానికి కమ్మేసిన పొగమంచు
భువనేశ్వర్: శీతాకాలానికి స్వాగతం పలుకుతూ ఈ సీజన్‌లో తొలి పొగమంచు రాజధాని నగరాన్ని కమ్మేసింది. శనివారం తెల్లవారుజామున నగరమంతా దట్టమైన పొగమంచు పరుచుకోవడంతో నగరవాసులకు కొత్త అనుభూతిని కలిగించింది. పలు ప్రాంతాల్లో దృశ్యమానత 150 మీటర్లకు పడిపోవడంతో రహదారులపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా ప్రధాన రహదారులపై వాహనాలు నెమ్మదిగా కదలడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాహనదారులు అప్రమత్తంగా ప్రయాణించాల్సి వచ్చింది. అర్నబ్ తుఫాను ప్రభావం తొలగిన అనంతరం వాతావరణంలో చోటుచేసుకున్న మార్పులతో పొగమంచు పరిస్థితులు నెలకొన్నాయి. రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడంతో చలి తీవ్రత స్వల్పంగా పెరిగింది. రాత్రివేళ చల్లని వాతావరణం, తెల్లవారుజామున పొగమంచు ఏర్పడటానికి దోహదపడినట్లు భావిస్తున్నారు. శనివారం ఉదయం నగరమంతా తెల్లటి పొగమంచు తెర కప్పుకోవడంతో వాతావరణంలో ఒక్కసారిగా మార్పు కనిపించింది. శీతాకాలం రాకకు ఇది తొలి సంకేతమని నగరవాసులు భావిస్తున్నారు.


