రాయగడ: జిల్లాలో రహదారి రవాణా సౌకర్యాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. కొమట్లపేట నుంచి మునిగుడ మీదుగా కందమాల్ జిల్లా తుముడిబంద్ వరకు ఉన్న రాష్ట్ర రహదారి–5ను రెండు వరుసల నుంచి నాలుగు వరుసల వరకు విస్తరించేందుకు జిల్లా యంత్రాంగం భూసేకరణ ప్రక్రియ ప్రారంభించింది. ఈ రహదారి విస్తరణ కోసం బిసంకటక్, మునిగుడ తహసీల్దార్ల పరిధిలోని 23 గ్రామాల్లో సుమారు 140 ఎకరాల ప్రైవేట్ భూమిని సేకరించనున్నారు. ఇందులో భాగంగా నవంబర్ 13న కంకుబడి పంచాయతీ పరిధిలోని గుతిగుడలో నవంబరు 16న చాంచారగుడ పంచాయతీ పరిధిలోని ఐదు గ్రామాలకు, నవంబర్ 17న గొయల్గణ, మాలిడేపాగుడ ప్రాంతాలకు సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ సమావేశాలను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) సంబంధిత శాఖ అధికారులకు, గ్రామ పంచాయతీల సర్పంచులకు సమాచారం అందించారు. రహదారి విస్తరణ వల్ల కలిగే ప్రభావాలు, సామాజిక అంశాలపై సమావేశాల్లో చర్చించనున్నారు. ఇదిలాఉండగా గత సెప్టెంబరులో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ రహదారి నిర్మాణానికి రెండు దశల్లో మొత్తం రూ.413.59 కోట్ల ఖర్చు అవుతాయని అంచనా వేశారు. దీనికి ఆమోదం కూడా లభించింది. మొదటి దశలో 30 కిలోమీటర్లకు రూ.212.11 కోట్లు, రెండోదశలో 30–45.615 కిలోమీటర్లకు రూ.201.48 కోట్లు కేటాయించారు. దీర్ఘకాలంగా అధ్వానంగా ఉన్న ఈ రహదారి అభివృద్ధి పూర్తయితే రవాణా సౌకర్యాలు మెరుగుపడడంతో పాటు ప్రాంతీయ సామాజిక, ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతుంది.
శౌర్య కేఫ్ నిర్మాణానికి
శంకుస్థాపన
మల్కన్‌గిరి: జిల్లా యంత్రాంగం చేపట్టిన వినూ త్న స్ఫూర్తిదాయక కార్యక్రమంలో భాగంగా జిల్లా గిరిజన మ్యూజియం సమీపంలో శౌర్య కేఫ్ నిర్మాణానికి కలెక్టర్ ప్రథమేశ్, ఎస్పీ వినోద్ పటేల్ శనివారం భూమిపూజ చేశారు. జిల్లా మావోయిస్టు కార్యకలాపాలు తీవ్రస్థాయిలో ఉన్న సమయంలో ప్రాణత్యాగం చేసిన చేసిన వారికి గౌరవ సూచికంగా ఈ కేఫ్‌ను నిర్మిస్తున్నారు. ప్రతి పౌరుడి దేశభక్తి, త్యాగనిరతి, సేవాభావాన్ని పెంపొందించే స్ఫూర్తిదాయక కేంద్రంగా ఈ కేప్ నిలుస్తుందని వెల్లడించారు.


