జయపురం: రాష్ట్ర రాజకీయాలు కొరాపుట్ జిల్లా పొట్టంగి సమితి కొటియా వివాదంపై నడుస్తున్నాయి. ఈ అంశంపై విపక్షాలు అధికార బీజేపీపై నిప్పుల వర్షం కురిపిస్తున్నాయి. దీంతో విపక్షాలకు బీజేపీ నేతలు జవాబిస్తూ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో బీజేపీ రాజీ పడదని స్పష్టం చేశారు. ఈ మేరకు రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి బిరంచి నారాయణ త్రిపాఠి మాట్లాడుతూ.. కొటియా ఒడిశాలో అంతర్భాగమన్నారు. దీనిలో ఒక అంగుళం నేలను కూడా ఆంధ్రప్రదేశ్‌కు వదిలేది లేదని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం 24 ఏళ్ల పాలనలో కొటియా శాశ్వత పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. గత పాలకులు ఏనాడూ కొటియ గ్రామాలను సందర్శించలేదని ఆరోపించారు. అటువంటి వారు ప్రస్తుతం మొసలి కన్నీరు కారుస్తున్నారని దుయ్యబట్టారు. సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోట్‌పాడ్ ఎమ్మెల్యే రూపు భొత్ర, కొరాపుట్ ఎమ్మెల్యే రఘరాం మచ్చ, జయపురం బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి గౌతమ్ సామంతరాయ్, హిమాంశు మహాపాత్ర తదితరులు పాల్గొన్నారు.


