● ఉప ముఖ్యమంత్రి కనకవర్ధన్
సింగ్ దేవ్
కొరాపుట్: కొఠియా గతంలోనూ.. ప్రస్తుతం.. భవిష్యత్‌లోనూ ఒడిశాదేనని ఉప ముఖ్యమంత్రి కనకవర్ధన్ సింగ్ దేవ్ స్పష్టం చేశారు. తుఫాన్‌తో ప్రభావితమైన కొరాపుట్ పర్యటనకు వచ్చిన ఆయన కొఠియా విషయంపై మాట్లాడారు. ఈ సందర్భంగా అవసరమైతే కొఠియాపై 26/11 తరహా రహస్య పద్ధతులతో పోరాటం చేస్తామన్నారు. శుక్రవారం కొఠియాపై రాజధానిలో అత్యున్నత స్థాయి సమావేశం జరిగిందన్నారు. తాను ఈ సమావేశంలో వర్చువల్‌గా పాల్గొన్నట్లు వెల్లడించారు. రానున్న రోజుల్లో కొఠియాపై ప్రభుత్వ విధానం మరింత కఠినంగా ఉంటుందని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం వైఫల్యం వలనే కొఠియా సమస్య దశాబ్ధాలుగా కొనసాగుతోందని ఆరోపించారు. పర్యటనలో భాగంగా సిమిలిగుడలో తుఫాన్ సహాయం ప్రజలకు నేరుగా అందించారు. మరోవైపు శుక్రవారం ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల ప్రచారం కోసం కొఠియాలో గాలిగబ్దర్ గ్రామానికి వచ్చిన రాజకీయ పార్టీల యువకులను పొట్టంగి సమితి అధికారులు అడ్డుకున్నారు. కొఠియా ఒడిశా ప్రాంతమని, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారం చేయకూడదని హెచ్చరించారు. పర్యటనలో కలెక్టర్ సత్యవాన్ మహాజన్, కొరాపుట్ ఎమ్మెల్యే రఘురాం మచ్చో తదితరులు ఉన్నారు.


