భువనేశ్వర్: ఒడిశాలో అర్నబ్ తుఫాన్ అనంతరం కురిసిన భారీ వర్షాలతో కొండచరియలు విరిగిపడి నలుగురు మృతి చెందగా, మరో 12 మంది గల్లంతయ్యారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రత్యేక సహాయక కమిషనర్ (ఎస్సార్సీ) రాజేష్ ప్రభాకర్ పాటిల్ శనివారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. తుఫాన్ అనంతరం కురిసిన ఎడతెరిపిలేని వర్షాల కారణంగా గంజాం, గజపతి, కంధమల్ జిల్లాలు తీవ్రంగా ప్రభావితమైనట్లు తెలిపారు. కంధమల్ జిల్లా రైకియా మండలం దంగేసి గ్రామంలో కొండచరియలు విరిగిపడటంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. మృతులను అచ్యుత ప్రధాన్, ఆయన భార్య అనిషా ప్రధాన్, వారి తొమ్మిది నెలల శిశువుగా గుర్తించారు. గజపతి జిల్లాలో గతంలో గల్లంతైన వారిలో ఒకరు మరణించినట్లు వెల్లడించారు. గంజాం జిల్లా భంజనగర్ మండలం గిడిపబాలి గ్రామంలో భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. ప్రమాద సమయంలో అక్కడ సుమారు 25 మంది ఉండగా, వారిలో 13 మంది గల్లంతైనట్లు సమాచారం అందిందని ఎస్సార్సీ తెలిపారు. తారాబటి ప్రధాన్ అనే వృద్ధురాలిని గుర్తించగా, మరో 12 మంది ఆచూకీ తెలియాల్సి ఉందన్నారు. గల్లంతైన వారి కోసం మూడు అగ్నిమాపక బృందాలతోపాటు ఎస్‌ఓజీ, ఎన్డీఆర్‌ఎఫ్‌కు చెందిన 160 నుంచి 170 మంది సిబ్బందిని రంగంలోకి దించినట్లు వివరించారు. శుక్రవారం రాత్రి నుంచి గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.
వరద తగ్గుముఖం
ప్రస్తుతం గంజాం జిల్లాలో మాత్రమే వరద పరిస్థితి కొనసాగుతోందని ఎస్సార్సీ పేర్కొన్నారు. రుషికుల్య నది నీటిమట్టం ప్రమాద స్థాయి కంటే దిగువన ఉండగా, జలక నది నీటిమట్టం కూడా తగ్గుముఖం పట్టిందన్నారు. జిల్లాలో దాదాపు అన్ని గ్రామాలకు రహదారి సంబంధాలు పునరుద్ధరించామని, ఒక్క గ్రామానికి మాత్రమే రాకపోకలు ఇంకా సాధ్యం కావడం లేదని చెప్పారు. ఆ గ్రామానికి విమాన మార్గంలో సహాయక సామగ్రి చేరవేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. వరద ప్రభావిత గ్రామాలన్నింటిలో బాధితులకు సహాయక సామగ్రితోపాటు వండిన ఆహారాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. గంజాం జిల్లాలో విద్యుత్ మౌలిక సదుపాయాల్లో 80 నుంచి 85 శాతం వరకు పునరుద్ధరించామని, శనివారం అస్కా ప్రాంతంలోనూ విద్యుత్ సరఫరాను పునరుద్ధరించనున్నట్లు వివరించారు. గంజాం జిల్లాలో వరదల కారణంగా 1,05,622 మంది
భారీగా కురిసిన వర్షాలకు విరిగిపడిన కొండచరియలు నలుగురు మృతి.. మరో 12 మంది గల్లంతు మృతులకు ఒక్కొక్కరికీ రూ.2 లక్షల పరిహారం ప్రకటన
ప్రభావితమయ్యారని, వారి కోసం 367 సహాయక శిబిరాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. గజపతి జిల్లాలో 21,782 మంది బాధితులకు ఆశ్రయం, ఆహారం అందించేందుకు 340 శిబిరాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అర్నబ్ తుఫాన్ అనంతరం నెలకొన్న వరద పరిస్థితి దృష్ట్యా, విపత్తు ప్రతిస్పందన మరియు సహాయక చర్యల కోసం గంజాం జిల్లాకు ఆర్థిక సహాయంగా అదనంగా రూ.20 కోట్లు విడుదల చేశారు.
నవీన్ పట్నాయక్ సంతాపం
కంధమల్ జిల్లాలో కొండచరియలు విరిగిపడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మరణించడంపై ప్రతిపక్ష నేత నవీన్ పట్నాయక్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రజలను సురక్షితంగా రక్షించడంతోపాటు సాధారణ జనజీవనాన్ని త్వరగా పునరుద్ధరించేందుకు ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలూ చేపట్టాలని కోరారు.
రూ.4 లక్షల చొప్పున పరిహారం
కంధమల్ జిల్లా రైకియా మండలం దంగేసి గ్రామంలో కొండచరియలు విరిగిపడి ఇంటి శిథిలాల కింద చిక్కుకుని మరణించిన అచ్యుత ప్రధాన్, ఆయన భార్య అనీషా ప్రధాన్, వారి తొమ్మిది నెలల శిశువు కుటుంబాలకు ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ రూ.4 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.


