ఇచ్ఛాపురం రూరల్: తుఫాన్ ధాటికి పంటను నష్టపోయిన రైతులు తన వద్దకు వస్తే, నమోదు చేసి ప్రభుత్వం తరఫున పరిహారం ఇప్పిస్తానని మండలానికి చెందిన ఓ టీడీపీ నాయకుడు బాధిత రైతులను ప్రలోభాలకు గురి చేస్తున్నాడు. అర్నబ్ తుఫాన్ ప్రభావానికి కొఠారీ గ్రామానికి చెందిన వందలాది ఎకరాలు ముంపునకు గురయ్యాయి. పంట నష్టాన్ని సంబంధిత వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో నమోదు చేయాల్సి ఉండగా, స్థానిక మాజీ సర్పంచ్, ఏఎంసీ మాజీ చైర్మన్ సాడి సహదేవ్‌రెడ్డి రెడ్డి మాత్రం పంట నష్టం తనకు నమోదు చేయమన్నారంటూ బాధిత రైతుల వద్ద భూ పత్రాలు సేకరిస్తూ, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ ఓటు వేసిన వారికి మాత్రమే పరిహారం ఇవ్వడం జరుగుతుందంటూ ప్రలోభాలకు గురిచేస్తున్నాడంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పటికీ ఇలా బహిరంగంగా పంట నమోదు పేరిట బాధిత రైతులకు ప్రలోభాలకు గురి చేయడం, హెచ్చరికలు జారీ చేయడం ఎంత వరకు సమంజసమని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


