● నెల్లిమెట్ట వద్ద నీట మునిగిన 50 ఎకరాల వరి ● గగ్గోలు పెడుతున్న అన్నదాతలు
ఆమదాలవలస రూరల్: నెల్లిమెట్ట ప్రాంతంలో నాగావళి నది గట్టుకు గండిపడటంతో సుమారు 50 ఎకరాల్లో వరి పంటపొలాలు నీట మునిగాయి. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. వరదల కారణంగా ముంప్పు కష్టాలు తప్పడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరకట్టలు నిర్మిస్తామని పాలకులు హామీలు ఇవ్వడమే తప్ప క్షేత్రస్థాయిలో పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. పంట పొలాల మీదుగా వరద నీరు ప్రవహిస్తుండటంతో ఆ ప్రాంతానికి వెళ్లే అవకాశం కూడా లేదని రైతులు అంటున్నారు. గండిపడిన ప్రాంతాన్ని స్థానిక నాయకులు ప్రవీణ్‌కుమార్, శ్రీరామ్మూర్తి, రామారావు తదితరులు పరిశీలించి పంట నష్టాన్ని అధికారులకు వివరించారు.
పంట నష్టం గుర్తిస్తాం..
ఈ విషయమై మండల వ్యవసాయాధికారి అధికారి మెట్ట మోహనరావు మాట్లాడుతూ గండిపడిన విషయం తమ దృష్టికి కూడా వచ్చిందని, ప్రస్తుతం అక్కడికి వెళ్లేందుకు అవకాశం లేదని, పంట నష్టం గుర్తించి జిల్లా అధికారులకు తెలియజేస్తామని చెప్పారు.


