● ఆస్పత్రిలో మృతి
భువనేశ్వర్: పూరీలోని జగన్నాథ ఆలయంలో దర్శనం చేసుకుంటుండగా ఓ భక్తుడు అకస్మాతుగా అస్వస్థతకు గురయ్యాడు. అనంతరం అతడు మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. మృతుడు జాజ్‌పూర్ జిల్లా అలార్‌పూర్ నుంచి వచ్చిన 75 ఏళ్ల నీలకంఠదాస్‌గా గుర్తించారు. పోలీసుల కథనం ప్రకారం.. ఆలయ ప్రాంగణంలో జగన్నాథుని దర్శనం చేసుకుంటుండగా దాస్ అకస్మాత్తుగా అస్వస్థతకు గురై కుంగిపోయాడు. ఘటనా స్థలంలో మోహరించిన ఆలయ పోలీసు సిబ్బంది తక్షణమే స్పందించి ఆలయ ప్రాంగణంలోని ప్రథమ చికిత్స కేంద్రానికి తరలించారు. అనంతరం పూరీ జిల్లా ప్రధాన ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యులు పరీక్షించగా అప్పటికే మరణించినట్లు ప్రకటించారు. దాస్‌కు ముందు నుంచే గుండె, ఊపిరితిత్తులకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు తేలింది. పోస్ట్‌మార్టం నివేదిక తర్వాతే మరణానికి గల కారణం స్పష్టమవుతుంది అని పోలీసులు తెలిపారు. ఈ విషయమై అవసరమైన చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయి. దర్శనం కోసం నీలకంఠ దాస్‌తో గుడికి వెళ్లిన అతని భార్య తన భర్తకు గతంలో ఊపిరితిత్తులు, గుండె సంబంధిత సమస్యలు ఉన్నాయని పోలీసులకు తెలిపారు.
బంకిలి పాఠశాల విద్యార్థి మృతి
రాయగడ: జిల్లాలోని సదరు సమితి పరిఽధి బంకిలిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థి తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందిన ఘటన తీవ్ర కలకలం రేపింది. మృతుడు విజయ్ పువ్వల (13 )గా గుర్తించారు. శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బంకిలి ప్రభుత్వ ఉన్నత పాఠశాల వసతి గృహంలో ఉంటూ విజయ్ చదువుకుంటున్నాడు. కొద్ది రొజులుగా తీవ్ర అస్వస్థతకు గురైనప్పటికీ పాఠశాల యాజమాన్యం కుటుంబీకులకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. పరిస్థితి మరింత తీవ్రంగా ఉండడంతో తోటి విద్యార్థులు విజయ్ తల్లిదండ్రులకు విషయాన్ని తెలియజేశారు. వెంటనే అక్కడకు చేరుకున్న విజయ్ తండ్రి సితు పువ్వల తన కొడుకును ఇంటికి తీసకువెళ్లాడు. అప్పటికే తీవ్ర విజయ్ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం స్థానిక జిల్లా కేంద్రాస్పత్రికి చికిత్స కోసం కుటుంబీకులు తరలించారు. అయితే చికిత్సావస్థలో శుక్రవారం రాత్రి మృతి చెందాడు. తన కొడుకు ఆరోగ్యం బాగోలేదని కనీసం పాఠశాల నిర్వాహకులు తమకు తెలియజేయకపోవడంతోనే ఇంత దారుణం జరిగిందని కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేశారు.
మొక్కల పంపిణీ
పర్లాకిమిడి: గజపతి జిల్లా గుమ్మాబ్లాక్ మునిసింగి వద్ద రబ్బరు ప్లాంటేషన్ కోసం ఆదివారం గిరిజనులకు శిక్షణ శిబిరం నిర్వహించారు. ఈ శిక్షణా శిబిరంలో జిల్లా సమగ్ర గిరిజనాభివృద్ధిశాఖ అధికారి అంశుమాన్ మహాపాత్రో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. శిక్షణ శిబిరంలో రబ్బరు మొక్కలను నాటేటప్పుడు ఎంత దూరం ఉండాలి, రబ్బరు పాలు చెట్టు పెరిగిన ఎన్ని నెలల తర్వాత తీయాలి, వాటిని ఆరబెట్టడం వంటి సాధానాలను అధికారులు రైతులకు శిక్షణ అందించారు. అనంతరం ఐటీడీఏ పీఓ అంశుమాన్ మహాపాత్రో గిరిజనులకు రబ్బరు మొక్కలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రబ్బరు బోర్డు మ్యానేజరు సనాతన శెఠి, అసిస్టెంట్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ సుశీల్ కుమార్ పాల్గొన్నారు.


