పర్లాకిమిడి: తన జీవితం అంతరాల్లో వెలుగునిచ్చిన కథా సంపుటి ‘జీవన్ సంగ్రాం’ను తెలుగులో రచయిత్రి, సంగీత కళాకారిణి బల్లికాన కోమలాంగి అనువదించడం సంతోషంగా ఉందని బరంపురం దక్షిణ మండళం, ఉత్తరాంచల్, రెవెన్యూ డివిజనల్ కమిషనర్ సంగ్రాం కేసరి మహాపాత్రో అన్నారు. గజపతి జిల్లాలో ఆదివారం పర్యటించి స్థానిక బిజూ కళ్యాణ మండపంలో స్వీయ రచన జీవన సంగ్రాం తెలుగు అనువాదం కథల సంపుటిని కలెక్టర్ అక్షయసునీల్ అగర్వాల్, సెంచూరియన్ వర్శిటీ ఉపాధ్యక్షులు ఆచార్య డి.ఎన్.రావు చేతుల మీదుగా పుస్తకావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా డి.ఎన్.రావు మాట్లాడుతూ ఒడియా భాష నుంచి తెలుగులోకి అనువదించడం చాలా కష్టమన్నారు. కళింగ, తెలుగు, ఒడియా భాషల సమ్మేళనమన్నారు. తెలుగులో ఎందరో మహానుభావులు రాసిన మరెన్నో మహా గ్రంథాలు ఉన్నాయని, వాటిని ఒడియా భాషలోకి అనువాదం చేస్తే అన్నివిధాలా సహకారం అందిస్తానని చెప్పారు. కొద్దిరోజుల క్రితం గవర్నరు కంభంపాటి హరిబాబు చేతులమీదుగా భువనేశ్వర్‌లో ఆవిష్కరించిన జీవన సంగ్రాం తెలుగు కాపీ, ప్రస్తుతం పర్లాకిమిడిలో తెలుగు పాఠకులకు పరిచయం చేయడం ఎంతో ఆనందంగా ఉందని కలెక్టర్ అక్షయ సునీల్ అగర్వాల్ అన్నారు. అనంతరం ‘సిద్ధాంత’ వార్షిక పుస్తకాన్ని కూడా ఆవిష్కరించారు. డి.ప్రియాంక ఒడిస్సీ నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది.కార్యక్రమంలో ఆర్‌డీసీ సంగ్రాం మహాపాత్రో సతీమణి ధరిత్రి పట్నాయిక్, పూర్ణచంద్ర మహాపాత్రో, రచయిత బల్లికాన కోమలాంగి, సంస్కృతి మహావిద్యాలయం విశ్రాంత ప్రిన్సిపాల్ అన్నపూర్ణాదేవి, విశ్రాంత తెలుగు పండితులు (ఎస్.కె.సి.జి.కళాశాల) మరువాడ శివరామకృష్ణ, అధ్యాపకులు ఎన్.భానుశ్రీ తదితరులు పాల్గొన్నారు.


