99 ఎకరాల సేకరణ | - | Sakshi
Sakshi News home page

99 ఎకరాల సేకరణ

Aug 17 2026 12:59 AM | Updated on Aug 17 2026 12:59 AM

జయపురం: జయపురం–నవరంగపూర్‌ నూతన రైల్వే మార్గం కోసం సేకరిస్తున్న భూములను రైల్వే అధికారులకు అందజేయటంలో మరింత ప్రగతిని సాధిస్తున్నట్లు జయపురం సబ్‌డివిజన్‌ బొయిపరిగుడ రెవెన్యూ అధికారులు వెల్లడించారు. రైల్వే నిర్మాణానికి అవసరమైన భూమి సర్వే, భూసేకరణ దాదాపు పూర్తి కావస్తుందని ఆ వర్గాలు వెల్లడించాయి. పరిపాలనపరంగా ఆమోదం లభించిన తరువాత భూ సర్వే, భూసేకరణ ప్రారంభించామని, ఆ భూమిని రైల్వే విభాగ అధికారులకు అప్పగిస్తున్నట్లు వివరించారు. గతంలో మొదటి దశలో కొరాపుట్‌ తహసీల్దార్‌ పరిధిలో బొరగాం, అర్దలి మౌజాలలో 30.410 ఎకరాల భూమిని రైల్వే అధికారులకు స్వాధీనపరచామన్నారు. ఆదివారం 99.104 ఎకరాల భూమి రైల్వే అధికారులకు అప్పగించామన్నారు. ఈ భూమి బొరిగుమ్మ సమితి 5 గ్రామల రైతుల నుంచి సేకరించి వాటికి సంబంధించిన దస్తావేజులకు ఈస్ట్‌ కోట్‌ రైల్వే జోన్‌ ఏఈఈ ఎస్‌.మురళీధర్‌కు అందజేశామన్నారు. రైల్వే అధికారులకు అందజేసిన భూములు కుంధ్రాగుడలో 20.05 ఎకరాలు, మఝియలో 24.394 ఎకరాలు, శీశాగుడలో 18.060 ఎకరాలు, కొహ్నయిజబలో 19.51ఎకరాలు, కుపియలో 17.078 ఎకరాలను 187 మంది రైతుల నుంచి సేకరించామన్నారు. బొరిగుమ్మ తహసీల్దార్‌ శోభన్‌ కుమార్‌ బెహర వివిరణ ప్రకారం జయపురం–నవరంగపూర్‌ రైల్వే లైన్‌ భూసేకరణ ప్రక్రియలో దాదాపు 227 ఎకరాల భూసేకరణకు దాదాపు రూ.11 కోట్ల 26 లక్షల 74 వేల 434 పరిహారం చెల్లించాలని నిర్ణయించటం జరిగిందన్నారు. ఇంతవరకు రూ.9 కోట్ల 93 లక్షల 92 వేల 892 నష్ట పరిహారంగా చెల్లించినట్లు తెలిపారు. రైల్వే అధికారికి భూమి దస్తావేజులు అప్పగించిన సమయంలో రైల్వే జూనియర్‌ ఇంజినీర్‌ (పి.ఎస్‌.ఎస్‌.ఎ) గోవింద బారిక్‌, రెవెన్యూ అధికారులు బొరిగుమ్మ తహసీల్దార్‌ శోభన్‌ కుమార్‌ బెహరా, ఎస్‌ఆర్‌ఏ సంజయ కుమార్‌ టక్రి, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ వనజలక్ష్మీ బెహరా, సుధామ్‌ నాయక్‌, మనోలిస ఎక్క, జ్యోష్న పాడీ భూములు ఇచ్చిన రైతులు పాల్గొన్నట్లు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement