టెక్కలి రూరల్ : టెక్కలిలోని గురుకుల పాఠశాల సమీపంలో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ వద్ద ఓ వ్యక్తి మృతదేహం ఈ నెల 2న వెలుగుచూసిన సంగతి తెలిసిందే. మృతుడి వివరాలను పోలీసులు శుక్రవారం వెల్లడించారు. బీహార్ రాష్ట్రం మారియా గ్రామానికి చెందిన సునీల్‌కుమార్ మారాండీ(35) మతిస్థిమితం సరిగా లేకపోవడంతో ఇక్కడికి వచ్చాడని, ఈ నెల 1వ తేదీ రాత్రి బొరిగిపేట గ్రామంలో తిరుగుతుండగా గ్రామస్తులు పట్టుకుని దొంగగా అనుమానించారని తెలిపారు. మరుసటి రోజు ఉదయం విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ వైర్ పట్టుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని చెప్పారు. ఈ మేరకు కుటుంబసభ్యులు రావడంతో మృతదేహానికి శవపంచనామా నిర్వహించి అప్పగించనున్నట్లు తెలిపారు.
కొత్తూరు: కొత్తూరు బీసీ కాలనీ, మెట్టూరు బిట్–3 ఆర్‌ఆర్ కాలనీలో శుక్రవారం విషాదఛాయలు అలముకున్నాయి. బీసీ కాలనీకి చెందిన దామాన ఆదినారాయణ(45), ఆర్‌ఆర్ కా లనీకి చెందిన మచ్చ తిరుపతిరావు(40) శుక్రవారం హైదరాబాద్‌లోని టోలిచౌక్‌లో పరంజీ కూలిన ప్రమాదంలో దుర్మరణం చెందారు. వీరిద్దరూ పదేళ్లుగా హైదరాబాద్‌లో మేస్త్రి పనులు చేసుకుంటూ కుటుంబాలను పోషిస్తున్నారు. ఆదినారాయణకు భార్య అనిత, ఇద్దరు పిల్లలు ఉన్నారు. తిరుపతిరావుకు భార్య రజిని, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
రణస్థలం: ఒడిశాలోని హడ్డుబంగి నుంచి హైదరాబాధ్ వెళుతున్న స్కార్పియో కారు అదుపుతప్పి లావేరు మండలం అదపాక ఫ్లై ఓవర్ బ్రిడ్జిపై శుక్రవారం తెల్లవారుజామున బోల్తా పడింది. ఈ ఘటనలో కారులో ఉన్న ఆరుగురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 అంబులెన్సులో శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించి చికిత్స అందించారు. డ్రైవర్ నిద్రమత్తే ఘటనకు కారణమని లావేరు పోలీసులు భావిస్తున్నారు.
చెరువులో గుర్తు తెలియని
మృతదేహం
పలాస: గోపాలపురం పెద్ద చెరువులో శుక్రవా రం గుర్తు తెలియని మృతదేహం లభ్యమైనట్లు కాశీబుగ్గ సీఐ రామకృష్ణ తెలిపారు. శరీరం మ ట్టిలో కలిసిపోయి ఎముకుల గూడు మాత్రమే మిగిలి ఉందన్నారు. షర్టు, షార్టు ధరించి ఉన్నాడని, వివరాలకు కాశీబుగ్గ పోలీసుస్టేషన్ (6309990825)లో సంప్రదించాలని కోరారు.
టెక్కలి: టెక్కలి ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాల లో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి గో కార్టింగ్ పోటీల్లో భాగంగా శనివారం ఫైనల్ రేస్ జరగనుంది. ఈ మేరకు శుక్రవారం సెమీ ఫైనల్ రేసింగ్ పోటీలు నిర్వహించారు. సామర్థ్యపు పరీక్షల నిపుణులు దుర్గాప్రసాద్, ఎం.కిరణ్‌కు మార్, శివతేజ, పి.హిర్లఖర్, సాగర్ వ్యాస్, ఎం.శంకర్ సాయిరాం, ఎం.కులదీప్‌కుమార్, జి. వరుణ్‌రెడ్డి తదితర బృందం సెమీ ఫైనల్ పోటీలను ప్రత్యేకంగా పర్యవేక్షణ చేసి ఆయా వాహనాల సామర్థ్యాలను పరిశీలించారు. కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ వీవీ నాగేశ్వరరావు, ప్రిన్సిపాల్ ఏఎస్ శ్రీనివాసరావు, కన్వీనర్ డి.శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లోకి వచ్చే ముందు జనసేన నాయ కుడు నాగబాబు, కూటమి నాయకులు ప్రజలకు క్షమాపణ చెప్పాలని వైఎస్సార్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మెంటాడ స్వరూప్ డిమాండ్ చేశారు. ఎచ్చెర్ల నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ నుంచి వలసలను ప్రోత్సహిస్తున్న నాగబాబు ముందుగా జిల్లాలో జరిగిన సామాజిక అన్యాయంపై స్పందించి క్షమాపణ చెప్పాల్సిన అసవరం ఉందన్నారు. శుక్రవారం స్వరూప్ నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, అందులో కనీసం 5 నియోజకవర్గాలు కాపు సామాజిక వర్గానికి సీట్లు కేటాయించాల్సిన అవసరం ఉందన్నారు. అయితే రాజాం, పాలకొండ నియో జకవర్గాలు ఎస్సీ, ఎస్టీ సోదరులకు రిజర్వేషన్ల వల్ల పోటీ చేయలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఆమదాలవలస నియోజకవర్గంలో కాపులు, కాళింగ సోదరులు సమానంగా ఉన్నప్పటికీ సంప్రదాయం ప్రకారం కాళింగ సామాజిక వర్గం పోటీ చేస్తోందన్నారు. మిగిలిన ఎచ్చెర్ల, పాతపట్నం నియోజకవర్గాలు కాపు సామాజిక వర్గానికి రావాల్సిన పరిస్థితి ఉందన్నారు. గత ఎన్నికల్లో కూటమి నాయకులు ఎచ్చెర్ల సీటును స్థానిక ప్రజల అభిప్రాయాలతో సంబంధం లేకుండా నియోజకవర్గంలో కనీసం 400 ఓట్లు కూడా లేని ఒక సామాజిక వర్గానికి సీటు కేటాయించి కాపు సామాజిక వర్గానికి తీవ్ర అన్యా యం చేశారని విమర్శించారు. పెత్తందారుల కింద కాపులు, బీసీలు, ఎస్సీ, ఎస్టీలు పని చేయాలా అనే ప్రశ్నను ఆయన లేవనెత్తారని, నాగేంద్రబాబు, కూటమి నాయకులు ముందుగా క్షమాపణ చెప్పిన తర్వాతే ఇక్కడ రాజకీయాలు చేయాలన్నారు.


