పర్లాకిమిడి: ఏఓబీ మావోయిస్టు నేత దున్న కేశవరావు అలియాస్ ఆజాద్‌ను శుక్రవారం గజపతి జిల్లా కోర్టుకు ప్రత్యేక వాహనంలో అత్యంత భద్రత నడుమ తీసుకువచ్చారు. 14 ఏళ్ల కిందట ఆయనపై నమోదైన కేసులకు సంబంధించి తీర్పు వెలువరించారు. ఆజాద్ పై మొత్తం 36 కేసులు ఉన్నాయి. అందులో ఒకటి బిస్సం కటక్ పరిధిలోని ఒకటి ఉంది. మొత్తం 36 క్రిమినల్ కేసులకు గాను నాలుగు కేసులు వాదించారు. వాటిలో 2 కేసులు సరైన సాక్ష్యాధారాలు లేకపోవడం వల్ల న్యాయమూర్తి కొట్టివేశారు. సుప్రీంకోర్టులో 2024లోఒక కేసు పెండింగ్‌లో ఉంది. మిగతా 32 కేసులు వర్చువల్ పద్ధతిలో విచారిస్తామని న్యాయాధికారులు తెలియజేశారు. 14 ఏళ్లు ఒడిషా జర్‌ఫడా (భువనేశ్వర్)జైలులో ఉన్న ఆజాద్ అలియాస్ డి.కేశవరావు కేసులను సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఒక ఏడాదిలో విచారణ పూర్తి చేయాలన్న ఆదేశాలపై నేడు పర్లాకిమిడి జిల్లా కోర్టులో హాజరుపరిచినట్టు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎం.పృథ్వీరాజ్ తెలిపారు. ఆజాద్ తరపున న్యాయవాది స్వరూప్ కుమార్ పాల్ వాదనలు వినిపించారు. శ్రీకాకుళం జిల్లా పలాస మండళం నల్లబొడ్లూరు గ్రామానికి చెందిన డి.కేశవరావు గత 14 ఏళ్లుగా భువనేశ్వర్ జైలులో విచారణ ఖైదీగా ఉంటున్నారు. విచారణ అనంతరం ఆజాద్‌ను మధ్యాహ్నం 2.30 సమయంలో భువనేశ్వర్ జైలుకు తరలించారు.


