యువకుడి దారుణ హత్య | - | Sakshi
Sakshi News home page

యువకుడి దారుణ హత్య

Mar 7 2026 9:29 AM | Updated on Mar 7 2026 9:29 AM

జయపురం: జయపురం సబ్‌ డివిజన్‌ కోట్‌పాడ్‌ సమితి గులిమి పర్యాటక ప్రాంతంలో ఒక యువకుడి మృతదేహాన్ని స్థానికులు శుక్రవారం గుర్తించారు. ఒక రాయి కింద ఉన్న ఆ మృతదేహం కోడ్‌పాడ్‌ సమితి ముర్తిహండి గ్రామానికి చెందిన భగీరథి హరిజన్‌(30)దిగా నిర్ధారించారు. విషయం తెలియడంతో ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. యువకుడిని హత్యచేసి అనంతరం గులుమి జలపాతంలో ఒక రాయి కిందకు మృతదేహాన్ని తోసేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా అనుమానితులైన ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు బొరిగుమ్మ సబ్‌ డివిజన్‌ పోలీసు అధికారి సత్యభ్రత లెంక వెల్లడించారు. హత్యకు గల కారణాలు తెలియలేదని, పోస్టుమార్టం రిపోర్టు వచ్చాక మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉందన్నారు. కోట్‌పాడ్‌ పోలీసు అధికారి ఫకీర్‌ మోహన్‌ కర్‌ కేసు దర్యాప్తు జరుపుతున్నారు.

రోడ్డు ప్రమాదంలో

ఇద్దరు మృతి

మరొకరికి తీవ్రగాయాలు

భువనేశ్వర్‌: భువనేశ్వర్‌, పూరీ జాతీయ రహదారిపై దండముకుందపూర్‌ బైపాస్‌ సమీపంలో గురువారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు సంఘటనా స్థలంలోనే ప్రాణాలుకోల్పోగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పిప్పిలి ప్రాంతంలో రోడ్డు దాటుతున్న వారిని వేగంగా వచ్చిన హైవా ట్రక్‌ దూసుకెళ్లడంతో ప్రమాదం జరిగింది. గాయపడిన వ్యక్తిని చికిత్స కోసం భువనేశ్వర్‌ క్యాపిటల్‌ ఆస్పత్రికి తరలించారు. అయితే ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్య వర్గాల సమాచారం. మృతుల ఆచూకీ తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.

ఇంటిలోకి

దూసుకు పోయిన ట్రాలర్‌

ఒకరు దుర్మరణం

భువనేశ్వర్‌: ఢెంకనాల్‌ జిల్లా గోండియా మండలం హత్తిబాడి గ్రామంలో గురువారం రాత్రి పూట ఒక గగుర్పొడిచే ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒక ట్రాలర్‌ అదుపు తప్పి ఇంట్లోకి దూసుకెళ్లింది. దీని ఫలితంగా ఇంటిలో నిద్రిస్తున్న ఒకరు దుర్మరణం పాలయ్యారు. ఆన్‌లైన్‌ మ్యాప్‌ సూచించిన మార్గాన్ని అనుసరించి ట్రాలర్‌ ఢెంకనాల్‌ నుంచి కోల్‌కతాకు సరుకు లోడుతో వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. మందర్‌ చౌరస్తా సమీపంలో ట్రాలరు అదుపు తప్పి హత్తిబాడి గ్రామంలో ఒక ఇంటి ముందు నిలిచి ఉన్న ట్రాక్టర్‌ను ఢీకొట్టి చేరువలో ఉన్న ఇంటిలోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో ఇంటికి తీవ్ర నష్టం వాటిల్లింది. ఇంటిలో నివసిస్తున్న అస్థిర తొరాయ్‌ అనే వ్యక్తి ఘటనా స్థలంలో ప్రాణాలు కోల్పోయాడు. ప్రాథమిక నివేదికల ప్రకారం ఈ ట్రాలరు జార్ఖండ్‌లో రిజిస్టర్‌ అయిందని తెలుస్తోంది. ఈ సంఘటన స్థానికుల్ని దిగ్భ్రాంతికి గురి చేసి విషాదం అలముకుంది.

బైక్‌ ఢీకొని వ్యక్తికి గాయాలు

జయపురం: జయపురం సబ్‌ డివిజన్‌ బొయిపరిగుడ సమితి రామగిరి ప్రాంతంలో బైక్‌ ఢీకొనడంతో ఒక వ్యక్తి గాయపడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. రామగిరి గ్రామానికి చెందిన మనోహర్‌ మచ్చ గ్రామ సమీపంలోని చెరువు వద్దకు కాలకృత్యాల కోసం వెళ్లి తిరిగి వస్తూ రోడ్డు వద్ద నిల్చున్నాడు. అదే సమయంలో గొడమపొణి గ్రామానికి చెందిన ఒక వ్యక్తి బొయిపరిగుడ నుంచి తన గ్రామానికి బైక్‌ వెళ్తూ మనోహర్‌ మచ్చను వెనుక నుంచి ఢీకొన్నాడు. దీంతో అతడు కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు మనోహర్‌ను రామగిరి ప్రాథమిక వైద్య కేంద్రంలో చేర్చారు. అనంతరం ఉన్నత చికిత్స కోసం అతడిని బొయిపరిగుడ కమ్యూనిటీ హాస్పిటల్‌కు తరలించారు. తదుపరి మరింత మెరుగైన వైద్యం కోసం కొరాపుట్‌ సాసహిద్‌ లక్ష్మణ నాయిక్‌ వైద్య విద్యాలయ మెడికల్‌కు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement