● రాష్ట్రంలో ఐదుగురు అభ్యర్థుల
నామినేషన్లు ఆమోదం
భువనేశ్వర్: రాష్ట్రంలో ఈ నెలలో జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో పోటీకి అభ్యర్థుల ఆమోదం పూర్తయ్యింది. పోటీ కోసం దాఖలు చేసిన ఐదుగురు అభ్యర్థుల దస్తావేజుల పరిశీలన ప్రక్రియ శుక్రవారం పూర్తయ్యింది. అందరినీ అర్హులుగా ప్రకటించారు. దీంతో రాజ్య సభ ఎన్నికల తొలి ఘట్టం విజయవంతంగా ముగిసింది. శుక్రవారం నిర్వహించిన నామినేషన్ల పరిశీలన ప్రక్రియలో సంతృప్త్ మిశ్రా, డాక్టర్ దత్తేశ్వర్ హొత్తా, మన్మోహన్ సామల్, సుజీత్ కుమార్, దిలీప్ రే నామినేషన్లు చెల్లుబాటు అయ్యాయి. సంతృప్త్ మిశ్రా మరియు డాక్టర్ దత్తేశ్వర్ బిజూ జనతా దళ్ (బీజేడీ) అభ్యర్థులుగా బరిలోకి దిగారు. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాష్ట్ర అధ్యక్షుడు మన్మోహన్ సామల్, సిట్టింగ్ రాజ్యసభ సభ్యుడు సుజీత్ కుమార్‌లను పోటీకి నిలబెట్టింది. అదనంగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న సీనియర్ నాయకుడు దిలీప్ రేకు భారతీయ జనతా పార్టీ మద్దతు ప్రకటించింది. రాష్ట్రం నుండి 4 రాజ్యసభ స్థానాల్లో మూడింటిని గెలుచుకునేందుకు బీజేపీ ఈ వ్యూహం పన్నినట్లు స్పష్టం అవుతుంది. రాజ్య సభ ఎన్నికల గణాంకం ప్రకారం ఒక సీటు గెలవాలంటే అభ్యర్థికి కనీసం 30 తొలి ప్రాధాన్యత ఓట్లు అవసరం. ప్రస్తుతం రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ బలం 82 మంది ఎమ్మెల్యేలు. వీరి మద్దతుతో ఆ పార్టీ 2 సీట్లను సులభంగా గెలుచుకునే అవకాశం ఉంది. చివరగా తన ఖాతాలో 22 మిగులు ఓట్లు ఉన్నాయి. ఈ భరోసాతో కావలసిన మరో 7 ఓట్లు కూడగట్టుకునే మనోధైర్యంతో స్వతంత్ర అభ్యర్థిని బరిలోకి దింపినట్లు బీజేపీ శిబిరాల కథనాలు ప్రచారంలో ఉన్నాయి. పోటీ నుంచి వైదొలిగే నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం పూర్తయితే రాజ్య సభ ఎన్నికల పోటీ ముఖ చిత్రం స్పష్టం అవుతుంది.


