శ్రీకాకుళం: ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకాన్ని స్మార్టీ కిచెన్‌ల పేరుతో ప్రైవేటు సంస్థలకు అప్పగించే ప్రయత్నాలు విరమించుకోవాలని, మెనూ చార్జీలు, కార్మికుల వేతనాలు పెంచాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరావు, యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షురాలు అల్లు మహాలక్ష్మి, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.సుశీల బి.ఉత్తర రాష్ట్ర ప్రభత్వాన్ని డిమాండ్ చేశారు. మధ్యాహ్న భోజనం పథకం కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం డీఈఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 23 సంవత్సరాలుగా ఈ పథకంలో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనాలు , ఇతర సౌకర్యాలు అమలు చేయకపోయినా, ఇదే పనిని నమ్ముకొని పనిచేస్తున్న కార్మికులను నట్టేట ముంచే ప్రయత్నం ఆపాలన్నారు. ప్రైవేట్ సంస్థలకు నిర్వహణ బాధ్యత అప్పగించడం వల్ల పిల్లలు వేడి ఆహారానికి దూరమవుతారని చెప్పారు. ఇప్పటి వరకు ఉపాధి పొందిన పేద కార్మికులు జీవనాధారం కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే అక్షయ పాత్ర, ఇస్కాన్ వంటి ప్రైవేటు సంస్థలు అందిస్తున్న చల్లని, చప్పటి భోజనాన్ని పిల్లలు తినలేక పడేస్తున్నారని గుర్తు చేశారు. అనంతరం సూపరింటెండెంట్ జి.కె.త్రిపాఠీకి వినతి పత్రంఅందజేశారు. ధర్నాలో యూనియన్ జిల్లా నాయకులు ఎ.రాధ, ఆర్.కాంతమ్మ, వి.లక్ష్మి, కె.కౌసల్య, టి.రామానుజమ్మ, జ్యోతి, వై.రత్నం తదితరులు పాల్గొన్నారు.


