వాహనాలకు గ్రీన్ స్టిక్కర్ తప్పనిసరి
● రాష్ట్ర రవాణా మంత్రి బిభూతి జెనా
భువనేశ్వర్: వాహన కాలుష్యాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోంది. ఈ దిశలో చెల్లుబాటు అయ్యే కాలుష్య ధ్రువీకరణ పత్రాలున్న వాహనాలకు మాత్రమే పెట్రోల్, డీజిల్ లభిస్తుందని ప్రకటించింది. త్వరలో వాహనాలకు కాలుష్య ధ్రువీకరణ ఆకుపచ్చ స్టిక్కర్‌ను ప్రదర్శించాల్సి ఉంటుందని రాష్ట్ర రవాణా మంత్రి బిభూతి జెనా శనివారం ప్రకటించారు. కాలుష్య ధృవీకరణ పత్రంలేని వాహనాలపై చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. పర్యావరణ నిబంధనలతో గాలి నాణ్యత ఏక్యూఐ, రహదారి భద్రతను మెరుగుపరిచే ప్రయత్నాల్లో భాగంగా ఈ నిబంధనలు కట్టుదిట్టం చేస్తున్నట్లు వివరించారు. రాష్ట్రంలో 2019 సంవత్సరంలో విధించిన జరిమానాలను తిరిగి పరిశీలించే అవకాశం ఉందని సూచించారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ప్రస్తుతం జరిమానాలు ఎక్కువగా ఉన్నందున వాటిని తగ్గించడానికి ప్రయత్నిస్తున్నారు.
గ్రీన్ స్టిక్కర్లను ప్రవేశపెట్టడం వల్ల కాలుష్య ప్రమాణాలకు అనుగుణంగా ఉండే వాహనాలను గుర్తించే ప్రక్రియ సులభతరం అవుతుందన్నారు. దీని వలన అధికారులకు నిబంధనలను అమలు చేయడం సులభతరం అవుతుందన్నారు.


