గణతంత్ర పరేడ్‌కు ఒడిశా ఎన్‌సీసీ క్యాడెట్లు
భువనేశ్వర్: వచ్చే ఏడాది జరగనున్న జాతీయ స్థాయి గణతంత్ర దినోత్సవం వేడుకల్లో పాల్గొనేందుకు రాష్ట్రం నుంచి 127 మంది ఎన్‌సీసీ క్యాడెట్లు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా 2026 జనవరి 29 వరకు న్యూఢిల్లీలో జరగనున్న గణతంత్ర దినోత్సవ శిబిరం (ఆర్‌డిసి)లో వీరంతా పాల్గొంటారు. ఈ క్యాడెట్లు దేశ రాజధానిలో జరిగే గణతంత్ర దినోత్సవ పరేడ్ మరియు ఎన్‌సీసీ ప్రధానమంత్రి ర్యాలీలో రాష్ట్రం తరపున ప్రాతినిధ్యం వహిస్తారు.
రాష్ట్రంలో దాదాపు 64,000 మంది ఎన్‌సీసీ క్యాడెట్ల నుంచి ఈ బృందాన్ని ఎంపిక చేశారు. ఎంపికై న 127 మంది క్యాడెట్లలో 80 మంది బాలురు, 47 మంది బాలికలు ఉన్నారు. వారిలో 112 మంది క్యాడెట్లు కళాశాల ఎన్‌సీసీ విభాగానికి చెందిన 71 మంది బాలురు మరియు 41 మంది బాలికలు, పాఠశాల ఎన్‌సీసీ విభాగానికి చెందిన 15 మంది క్యాడెట్లులో 9 మంది బాలురు, 6 మంది బాలికలు ఉన్నారు. 10 మంది సహాయక సిబ్బంది ఆధ్వర్యంలో వీరంతా శనివారం ఉదయం న్యూఢిల్లీకి బయలుదేరారు.
ఈ ప్రతిష్టాత్మక జాతీయ కార్యక్రమానికి సిద్ధం కావడానికి క్యాడెట్లు బయలుదేరే ముందు నవరంగ్‌పూర్‌లో నెల రోజులపాటు ఇంటెన్సివ్ శిక్షణ పొందారు. న్యూఢిల్లీకి బయలుదేరే ముందు క్యాడెట్లు రాష్ట్ర ఉన్నత విద్యా విభాగం మంత్రి సూర్యవంశీ సూరజ్‌తో సంభాషించారు. ఆయన వారిని ప్రోత్సహించి వారి విజయాన్ని ఆకాంక్షించారు. క్యాడెట్లను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ జాతీయ ఐక్యత, సమగ్రతపై ఎన్‌సీసీ క్యాడెట్ల క్రమశిక్షణ, అంకిత భావం, నిబద్ధత అందరికీ స్ఫూర్తిదాయకమని అన్నారు. గణతంత్ర దినోత్సవ శిబిరంలో పాల్గొనడం క్యాడెట్‌లకు చిరస్మరణీయమైన మరియు సుసంపన్నమైన అనుభవంగా ఉంటుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. జాతీయ వేదికపై ఒడిశా క్యాడెట్లు రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించడం గర్వకారణమన్నారు.
ఒడిశాలో ఎన్‌సిసి క్యాడెట్ల సంఖ్యను పెంచడానికి విభాగం ప్రత్యేకంగా శ్రద్ధ వహిస్తుంది. ప్రధానంగా ఎన్‌సీసీలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచి రాష్ట్రంలో మహిళల కోసం ఎన్‌సీసీ బెటాలియన్ ఏర్పాటు చేయడానికి ఉన్నత విద్యా శాఖ ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఈ సందర్భంగా, ఒడిశా ఎన్‌సీసీ డైరెక్టరేట్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ కమాండరు విక్రమ్ సింగ్ రాష్ట్రంలో ఎన్‌సీసీ కార్యకలాపాలపై వివరణాత్మక సమాచారం ప్రవేశ పెట్టి రాష్ట్రంలో ఎన్‌సీసీని బలోపేతం చేయడానికి ఉన్నత విద్యా విభాగం చొరవ పట్ల ఆయన మంత్రికి ధన్యవాదాలు తెలిపారు.
గణతంత్ర పరేడ్‌కు ఒడిశా ఎన్‌సీసీ క్యాడెట్లు
గణతంత్ర పరేడ్‌కు ఒడిశా ఎన్‌సీసీ క్యాడెట్లు


