పూరీ, కోణార్క్ దేశానికి గర్వకారణం
● ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్
భువనేశ్వర్: మూడు రోజుల రాష్ట్ర పర్యటన నిమిత్తం భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ శనివారం నగరానికి చేరారు. తొలి రోజు ఆయన పూరీలోని శ్రీ జగన్నాథ ఆలయంలో పూజలు చేసి, జగన్నాథుని ఆశీస్సులు పొందారు. అనంతరం కోణార్క్‌లోని చారిత్రక సూర్య దేవాలయాన్ని సందర్శించారు. స్థానిక బిజూ పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఒడిశా ప్రధాన ఎన్నికల అధికారి ఆర్‌ఎస్ గోపాలన్, ఇతర సీనియర్ అధికారులతో కలిసి ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రధాన ఎన్నికల కమిషనర్ జగన్నాథునికి నమస్కరించి ఒడియా భాషలో ఒడిశా ప్రజలకు తన శుభాకాంక్షలు తెలిపి ప్రత్యేకంగా దృష్టిని ఆకట్టుకున్నారు.
పూరీలోని శ్రీ జగన్నాథ ఆలయంలో, ప్రధాన ఎన్నికల కమిషనర్ కుమార్‌కు ఆలయ అధికారులు జగన్నాథుడు, ఇతర దేవతల దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. శ్రీ జగన్నాథుని దర్శనం అనంతరం ప్రధాన ఎన్నికల కమిషనర్ మాట్లాడుతూ జగతి నాథుని దివ్య ఆశీస్సులు తన రాజ్యాంగ బాధ్యతలను మరింత చిత్తశుద్ధితో, నిబద్ధతతో నిర్వర్తించడానికి ప్రేరేపిస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. ఒడిశా కళ, సాహిత్యం, సంస్కృతి ప్రాచీనమైనవి, విశిష్టమైనవి అని వ్యాఖ్యానించారు. తన పర్యటనలో ఈ గొప్ప సంప్రదాయాల గురించి వీలైనంత ఎక్కువగా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తానని పేర్కొన్నారు.
శ్రీ జగన్నాథ ఆలయంలో పూజలు చేసిన తర్వాత ప్రధాన ఎన్నికల కమిషనర్ తీరప్రాంత
మార్గంలో ప్రయాణించి ప్రపంచ ప్రసిద్ధి చెందిన కోణార్క్ సూర్య దేవాలయాన్ని సందర్శించారు. యునెస్కోచే ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించిన విలక్షణమైన కళింగ శైలి వాస్తు శిల్పంలో నిర్మించిన కోణార్క్ అసాధారణమైన శిల్ప హస్తకళ చారిత్రక ప్రాముఖ్యతపై ఆయన ముగ్ధులయ్యారు.
కోణార్క్‌లో మాట్లాడుతూ సూర్య దేవాలయం ఒడిశా వారసత్వానికి చిహ్నం మాత్రమే కాదు, యావత్ దేశానికి గర్వకారణం మరియు గౌరవప్రదం అని పేర్కొన్నారు. ఆలయం వైభవాన్ని సూక్ష్మమైన హస్తకళను గమనిస్తే ప్రాచీన భారత దేశం సంపద, జ్ఞానం మరియు శాసీ్త్రయ పురోగతి పరంగా ఎంత సుసంపన్నంగా ఉండేదో నిజంగా అర్థం చేసుకోవచ్చన్నారు.
పూరీలోని శ్రీ జగన్నాథ ఆలయం, కోణార్క్‌లోని సూర్య దేవాలయం ఒడిశా యొక్క గొప్ప వారసత్వానికి, పురాతన సంప్రదాయాలకు అద్భుతమైన ఉదాహరణలుగా నిలుస్తాయన్నారు. ఈ పవిత్రమైన, చారిత్రక ప్రదేశాలను సందర్శించిన దివ్యానుభూతి తన జ్ఞాపకాల్లో శాశ్వతంగా నిలిచిపోతుందని ఆనందం వ్యక్తం చేశారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ పూరీ, కోణార్క్ పర్యటనలో ఒడిశా ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ఆర్. ఎస్. గోపాలన్, అదనపు ప్రధాన ఎన్నికల అధికారి సుశాంత్ కుమార్ మిశ్రా, సంయుక్త ప్రధాన ఎన్నికల అధికారి గోపీనాథ్ కన్హర్, ఉప ప్రధాన ఎన్నికల అధికారులు డాక్టర్ లక్ష్మీ ప్రసాద్ సాహు, అనామిక సింగ్, స్థానిక పరిపాలన అధికారులు, ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
పూరీ, కోణార్క్ దేశానికి గర్వకారణం
పూరీ, కోణార్క్ దేశానికి గర్వకారణం


