వేపాడ: మండలంలోని సోంపురం పంచాయతీకి చెందిన నర్సిపల్లి మెట్టపై క్వారీ పని చేస్తున్న కార్మికుడు ప్రమాదవశాత్తు కిందక జారిపడి అక్కడికక్కడే మృతి చెందాడు. దీనికి సంబంధించి తోటి కార్మికులు తెలిపిన వివరాలు... అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం పోలీగూడ గ్రామానికి చెందిన గెమ్మెల బుద్దు(30) రోజూలాగే శనివారం క్వారీ పనికి వెళ్లాడు. పని చేస్తుండగా కాలు జారి మెట్ట పైనుంచి కింద రాళ్ల గుట్టపై పడిపోయాడు. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న వల్లంపూడి ఎస్‌ఐ రాజేష్ తన సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుడికి భార్య లక్ష్మి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అందిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా కార్మికుడు మృతి చెందిన విషయం తెలసుకున్న సీఐటీయూ జిల్లా నాయకుడు చల్లా జగన్ సంఘటనా స్థలానికి చేరుకొని కార్మికులతో కలిసి ఆందోళన చేశారు. మృతి చెందిన కార్మికుడి కుటుంబానికి న్యాయం చేయాలని, పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.


