సామాన్యులకు ధరాఘాతం | - | Sakshi
Sakshi News home page

సామాన్యులకు ధరాఘాతం

Aug 25 2026 1:51 AM | Updated on Aug 25 2026 1:51 AM

సామాన్యులకు ధరాఘాతం

రూ.6వేల అదనపు భారం

కొండెక్కిన నిత్యావసర సరుకుల ధరలు బియ్యం, చక్కెర, వంట నూనెలు ప్రియం రెండున్నరేళ్ల కూటమి పాలనలోరెండింతలకు పైగా పెరిగిన వైనం నియంత్రించక చోద్యం చూస్తున్న కూటమి పాలకులు

ధరల పెరుగుదల ఇలా..

వన్‌టౌన్‌(విజయవాడపశ్చిమ): ‘ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్టు లేదు..’ అన్నట్లుగా సామాన్యుల పరిస్థితి దిగజారింది. కూటమి ప్రభుత్వ పాలనలో నిత్యావసర వస్తువుల ధరలకు రెక్కలు వచ్చాయి. రోజు రోజుకూ ఆకాశానికి ఎగబాకుతున్న ధరలు సగటు ప్రజలపై తీవ్రమైన ప్రభావం చూపుతు న్నాయి. ఒకటి కాదు రెండు కాదు ప్రధాన నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెరగడంతో వాటిని కొనుగోలు చేయాలంటేనే జంకుతున్నారు. బియ్యం, వంట నూనె, కంది పప్పు, మినప్పప్పు ధరలను వింటేనే సామాన్యులు బెంబేలెత్తుతున్నారు. బియ్యం ధరలన్నా అందుబాటులో ఉంటే పచ్చడి మెతుకులతోనైనా ఆకలి తీర్చుకునేవారిమని వాపోతున్నారు.

రెట్టింపైన బియ్యం ధరలు

రైతుల నుంచి ధాన్యం నిల్వలు మొత్తం వ్యాపారుల చేతిలోకి వెళ్లాయి. దీంతో బియ్యం ధరలకు ఒక్కసారిగా రెక్కలు వచ్చాయి. మరో వైపు వరి సాగు చేయొద్దని చంద్రబాబు ప్రభుత్వం రైతులకు సూచించడంతో బియ్యం ధరలు మరింత పెరిగాయి. 2024వ సంవత్సరం ఏప్రిల్‌ మాసంలో కర్నూల్‌ సోనామసూరి బియ్యం కిలో ధర రూ.40 నుంచి రూ.42 మధ్య పలికింది. కొన్ని ప్రాంతాల్లో రూ.45 వరకు విక్రయించారు. ప్రస్తుతం చంద్రబాబు పాలనలో బియ్యం ధరలు అమాంతం పెరిగిపోయాయి. కిలో బియ్యం కొనాలంటే రూ.70 నుంచి రూ.80 వరకు ఖర్చు చేయాల్సి వస్తోందని ప్రజలు వాపోతున్నారు. రైతు బజారులు, ప్రత్యేక కౌంటర్లలో కిలో సన్న బియ్యం రూ.52 చొప్పున విక్రయిస్తున్నట్లు మార్కెటింగ్‌ శాఖ ప్రకటించినా అన్ని చోట్లా అమలు కావడంలేదని ప్రజలు పేర్కొంటున్నారు.

పప్పులు.. వంట నూనెలదీ అదే పరిస్థితి

ఇతర నిత్యావసరాల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. వంట నూనెల ధరలు సలసల కాగుతున్నాయి. మార్కెట్‌లో పామాయిల్‌ లీటర్‌ రూ.160 చొప్పున విక్రయిస్తున్నారు. వేరుశనగ, సన్‌ఫ్లవర్‌ నూనెలు కంపెనీలను బట్టి లీటరు ప్యాకెట్‌ ధరు రూ.175 నుంచి రూ.195 వరకూ పలుకుతోంది. 2024వ సంవత్సరం ఏప్రిల్‌లో వీటి ధరలు కేవలం రూ.95 నుంచి రూ.105 మధ్యే ఉన్నాయి. ప్రస్తుత నూనెల ధరలు వింటేనే సామాన్యుల గుండె గుభేలుమంటోంది. ఇక ఎండుమిర్చి ధర అమాంతం పెరిగింది. మార్కెట్‌లో మంచి కాయ కావాలంటే కిలోకు రూ.350 నుంచి రూ.400 వెచ్చించాల్సిందే. పంచదార ధర మొన్నటి వరకూ మార్కెట్‌లో రూ.40 నుంచి రూ.45 మధ్యనే కొనసాగింది. ఇప్పుడు దాని ధర రూ.70లకు పైగా ఎగబాకింది. కొన్ని మాల్స్‌లో విడి పంచదార రూ.65 చొప్పున విక్రయిస్తుండగా బయట మార్కెట్‌లో మాత్రం రూ.74 వరకూ వసూలు చేస్తున్నారు.

కంటనీరు తెప్పిస్తున్న ఉల్లి

సాధారణంగా ప్రతి వంటలోనూ పెద్ద ఉల్లిపాయలు తప్పని సరి. పెరిగిన ధరలతో ఉల్లివాడకాన్ని మానుకోవాల్సి వచ్చిందని, రెండు మూడు పాయలు వాడాల్సిన కూరలో ఒకటీ అర వాడి సరి పెడుతున్నామని మహిళలు పేర్కొంటున్నారు. 2024వ సంవత్సరంలో కిలో ఉల్లిపాయలు ధర రూ.15 నుంచి రూ.18 మధ్య ఉండేది. నేడు అమాంతం పెరిగి రూ.60 దాటింది. రైతు బజా ర్‌లో కిలో రూ.47 చొప్పున విక్రయిస్తున్నా నాణ్యత అంతగా ఉండటంలేదని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. చేసేదేమీ లేక మార్కెట్‌లోనే కొనుగోలు చేస్తున్నారు. రిటైల్‌ మార్కెట్‌లో కిలో రూ.64 చొప్పున విక్రయిస్తున్నారు.

శుభకార్యాల ఇంట మరింత భారం

ప్రస్తుతం శ్రావణమాసం కావటంతో వివాహాల జోరు పెరిగింది. ఈ నెల చివరి వరకు వివాహాలు ఇతర శుభకార్యాలు చేసుకోవటానికి అనువైన ముహూర్తాలు ఉన్నాయి. దీంతో చాలా మంది శుభకార్యాలను తలపెట్టారు. అయితే పెరిగిన ధరలు భారంగా మారాయని వారు వాపోతు న్నారు. బంధు మిత్రులు అందరినీ ఆహ్వానించి ఘనంగా చేసుకోవాలని తొలుత అనుకున్నా ఇప్పుడు దగ్గరి వారిని మాత్రమే శుభకార్యాలకు పిలవాల్సి వస్తోందని పేర్కొంటున్నారు.

పట్టించుకోని చంద్రబాబు ప్రభుత్వం

ధరల పెరుగుదల భారీగా ఉన్నా, సామాన్యులు ఇబ్బంది పడుతున్నా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవటం లేదని ప్రజానీకం మండిపడుతోంది. ధరలను అదుపు చేయాల్సిన పాలకులు చోద్యం చూడటం ఏమిటని ప్రశ్నిస్తోంది. ప్రధానంగా ప్రభుత్వ శాఖలు పెరిగిన ధరలను అదుపు చేసేందుకు ఏమాత్రం స్పందించకపోవటంపై అన్ని వర్గాల ప్రజల నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతోంది. రైతుబజార్‌ తదితర ప్రాంతాల్లో మిల్లర్ల సాయంతో రూ.52 చొప్పున సన్న బియ్యం విక్రయిస్తున్నామని పాలకులు హడావుడీ చేసినా అమలు కావడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

విజయవాడ భవానీపురానికి చెందిన సుబ్రహ్మణ్యం దంపతులు నివసిస్తున్నారు. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. వన్‌టౌన్‌లోని ఒక దుకాణంలో గుమాస్తాగా పని చేస్తున్న సుబ్రహ్మణ్యం నెల జీతం రూ18 వేలు. బియ్యం, నూనెలు, కూరగాయలు ఇతర నిత్యావసర ధరలు పెరగటంతో నలుగురు ఉన్న తమ కుటుంబంపై రూ.6 వేల వరకూ అదనపు భారం పడిందని ఆయన తెలిపారు. అప్పారావు అనే కార్మికుడు సైతం నెలకు రూ.15 నుంచి రూ.16 వేలు సంపాదిస్తున్నాడు. ఆ కుటుంబంపైనా అదే పరిస్థితి ఉంది.

ప్రధాన నిత్యావసరాల ధరలు 2024 ఏప్రిల్‌ (కిలోధర) 2026 ఆగస్టు (కిలోధర)

సన్న బియ్యం రూ.40 నుంచి రూ.45 రూ.70 నుంచి రూ.80

వంట నూనెలు రూ.90 నుంచి రూ.105 రూ.170 నుంచి రూ.195

పంచదార రూ.38 నుంచి రూ.40 రూ.68 నుంచి రూ.74

ఉల్లిపాయలు రూ.15 నుంచి రూ.18 రూ.55 నుంచి రూ.65

ఎండుమిర్చి రూ.140 నుంచి రూ.150 రూ.350 నుంచి రూ.400

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement