ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రావణ మాసం నాల్గో శుక్రవారాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ నాలుగో తేదీన దుర్గగుడిలో సామూహిక వరలక్ష్మి వ్రతాలను ఆచరిస్తున్నట్లు ఆలయ అధికారులు సోమవారం తెలిపారు. ఆ రోజు మల్లికార్జున మహామండపం ఆరో అంత స్తులో ప్రత్యేక వేదికపై అమ్మవారిని ప్రతిష్టించి పూజా కార్యక్రమాలను నిర్వహిస్తారు. అదే ప్రాంగణంలో ఉదయం ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ప్రత్యేక ఆర్జిత సేవగా వరలక్ష్మి వ్రతం నిర్వహిస్తారు. ఈ సేవలో పాల్గొనే భక్తులు రూ.1500 టికెటు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. వరలక్ష్మి వ్రతంలో పాల్గొనే ఉభయదాతలకు అమ్మవారి కుంకుమ ప్రసాదం, శేషవస్త్రం, రవిక ముక్క, పెద్ద లడ్డూ, పూర్ణాలు, గాజులు అందజేస్తారు. అదే రోజు ఉదయం పది గంటల నుంచి 11.30 గంటల వరకు ఉచిత సామూహిక వరలక్ష్మి వ్రతం జరుగుతుంది. వ్రతం అనంతరం భక్తులకు రూ.300 క్యూలైన్‌లో అమ్మవారి దర్శనానికి అనుమతిస్తారు.
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఆయాలు, శానిటేషన్ వర్కర్లకు ఆరు నెలలుగా జీతాలు రావడం లేదని ఇఫ్టూ ఎన్టీఆర్ జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్‌కే మీరావలి ఆందోళన వ్యక్తం చేశారు. పెండింగ్ జీతాలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వర్కర్లకు జీతాలు ఇవ్వాలని కోరుతూ ఇఫ్టూ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద సోమవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాఠశాలల్లో పనిచేసే వర్కర్లు చాలీచాలని జీతాలతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. చెల్లించే రూ.6 వేలను కూడా నెల నెలా ఇవ్వడం లేదన్నారు. ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారిని పర్మ నెంట్ చేయాలని, సదుపాయాలు కల్పించా లని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టరేట్‌లో డీఈఓ చంద్రకళకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఇఫ్టూ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి కొప్పుల కుమార్, జిల్లామహిళా సంఘం అధ్యక్షురాలు ఎస్‌కే ఆసియా బేగం, కె.లక్ష్మి, కౌసల్య, ప్రేమ జ్యోతి, లక్ష్మి దీపిక, సువార్త, జ్యోతి, అంజలి, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.
మధురానగర్(విజయవాడసెంట్రల్): నగరంలోని అంబేడ్కర్ ఉద్యానవనంలో ఒక అలంకార చెట్టుపై అరుదైన పరాన్నజీవి మొక్కను ఎస్‌ఆర్‌ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ డిగ్రీకళాశాల వృక్షశాస్త్ర అధ్యాపకుడు డాక్టర్ సీహెచ్. శ్రీనివాసరెడ్డి సోమవారం గుర్తించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ మొక్కను స్థానికంగా బదనిక, వదనికి, వజనిక, ఎలింగ, జిద్దూ వంటి పేర్లతో పిలుస్తారని, దీని శాసీ్త్రయ నామం డెండ్రోపోయి ఫాల్కాటా అని తెలిపారు. ఉద్యాన వనంలోని టెర్మినాలియా మంటలీ అనే అలంకార చెట్టును పరిశీ లిస్తున్న సమయంలో ఈ మొక్కను గుర్తించా మన్నారు. ఆకుపచ్చని కొమ్మలు, ఆకులు ఆకర్షణీయమైన ఎరుపు రంగు పుష్ఫగుచ్ఛాలతో ఇది ప్రత్యేకంగా కనిపిస్తుందన్నారు. ఇది సాధారణ మొక్కల మాదిరిగా పూర్తిగా నేలపై ఆధారపడి పెరగదని, చెట్ల కొమ్మలపై పెరుగుతూ, తనకు అవసరమైన నీరు, ఖనిజ లవణాల్లో కొంత భాగాన్ని ఆ చెట్ల నుంచి పొందుతుందని వివరించారు. అయితే ఆకుపచ్చ ఆకులు ఉండటం వల్ల తన ఆహారాన్ని తానే తయారు చేసుకోగల పాక్షిక కాండ పరాన్నజీవి మొక్కగా దీనిని పరిగణిస్తారని వివరించారు.


