అర్జీల పరిష్కారం కాగితాలకే పరిమితం కాకూడదు పీజీఆర్‌ఎస్‌లో కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రజల నుంచి అందే ఫిర్యాదుల పరిష్కారం కేవలం కాగితాలకే పరిమితం కాకూడదని, క్షేత్ర స్థాయిలో వాస్తవాలను ప్రతిబింబిస్తేనే లక్ష్యం నెరవేరుతుందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ పేర్కొన్నారు. అర్జీల పరిష్కారానికి ప్రజల సంతృప్తే అసలైన కొలమానమని స్పష్టంచేశారు. కలెక్టరేట్‌లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమం సోమవారం జరిగింది. కలెక్టర్ లక్ష్మీశ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల సమస్యలకు సత్వర, నాణ్యమైన, శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు. అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని సూచించారు. తీసుకున్న చర్యలు, పరిష్కారం వివ రాలు స్పష్టంగా ఉండేలా ఎండార్స్‌మెంట్లు రూపొందించాలని ఆదేశించారు. తహసీల్దార్లు, ఎంపీడీఓలు సహా సంబంధిత అధికారులు ఆన్‌లైన్ సమీక్షలకు తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని సూచించారు. అప్పగించిన బాధ్యతలను నిర్లక్ష్యం చేయకుండా, ఫిర్యాదుల పరిష్కారంలో వ్యక్తిగత బాధ్యత తీసుకోవాలని కోరారు.
మొత్తం 192 అర్జీలు
పీజీఆర్‌ఎస్‌లో మొత్తం 192 అర్జీలు అందాయని అధికారులు తెలిపారు. అత్యధికంగా రెవెన్యూ శాఖకు సంబంధించి 66, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖకు 52, పోలీసు శాఖకు 22 అర్జీలు అందాయి. పంచాయతీ రాజ్‌కు 17, వైద్య ఆరోగ్యం, స్వర్ణ గ్రామం/స్వర్ణ వార్డు శాఖలకు ఆరు చొప్పున. వ్యవసాయం, ప్రజా రవాణా, కాలేజీ విద్య, పాఠశాల విద్య, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్, రహదారులు, భవనాల శాఖలకు రెండు చొప్పున, విద్యుత్, పౌర సరఫరాలు, సహకార, అటవీ, ఆర్‌ఐఓ, గ్రామీణ నీటిసరఫరా, గిరిజన సంక్షేమం, ఇతర శాఖలకు ఒక్కో అర్జీ వచ్చాయి. ఈ కార్యక్రమంలో డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం, జెడ్పీ సీఈఓ జె.అరుణ, పీజీఆర్‌ఎస్ నోడల్ అధికారి జె.జ్యోతి, వివిధ శాఖల జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.


