● ఉయ్యూరులో కొత్తగా మూడు డయేరియా కేసులు
ఉయ్యూరు: మండల కేంద్రమైన ఉయ్యూరులో డయేరియా ప్రబలడానికి గల అసలు కారణాలు వెల్లడించటంలో జాప్యం కొనసాగుతోంది. పట్టణంలోని పలు ప్రాంతాల్లో అతిసార వ్యాపించి వారం గడుస్తున్నా నీటి, ఆహార పదార్థాల పరీక్షల నివేదికలు సీల్డు కవరులో భద్రంగా ఉంచారు. స్థానిక ప్రజలు తాగునీటి కలుషితంగానే వాంతులు, విరేచనాలు బారిన పడ్డామని బాహాటంగానే చెబుతున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు పరామర్శిం చిన క్రమంలోనూ బాధితులు తాగునీటి కలుషితం సమస్యను స్పష్టంచేశారు. నీటి శ్యాంపిల్స్‌ను గుడివాడ, గుంటూరు ల్యాబ్‌లకు పంపామని మంత్రి నారాయణ మొదలు వైద్య, ఆరోగ్య శాఖ జేడీ అర్జున రావు వరకు చెప్పారు. సోమవారం నమూనా పరీక్షల ఫలితాలు వస్తాయని జేడీ అర్జునరావు ఆది వారం ఉయ్యూరులో పర్యటించిన క్రమంలో మీడియాకు వెల్లడించారు. మునిసిపల్ మంత్రి నారాయణ మాత్రం గుంటూరులో పరీక్షలు చేయటం పూర్తయిందని, మరింత లోతైన పరిశీలనకు చైన్నె పంపామని పేర్కొన్నారు. కృష్ణా జిల్లా ఫుడ్‌సేఫ్టీ అధికారి రవీంద్రారెడ్డి ఆధ్వర్యంలో మూడు రోజులు క్రితం ఉయ్యూరు పట్టణం అంతటా ఆహార తని ఖీలు చేపట్టారు. ఈ తనిఖీల నివేదికలూ గోప్యంగానే ఉన్నాయి. అతిసార వ్యాప్తికి నీటి కలుషితం కారణమా లేక ఆహార పదార్థాల కలుషితమా?, వాతావరణంలో మార్పులా? అనేది ఇంత వరకూ నిర్ధారించలేదు.
కొనసాగుతున్న ప్రత్యేక డ్రైవ్
డయేరియా ప్రబలిన నేపథ్యంలో పట్టణంలో ప్రత్యేక డ్రైవ్ కొనసాగుతోంది. వాటరు పైపులైన్ల మార్పు పనులు ముమ్మరం చేశారు. మునిసిపాలిటీకి సంబంధించిన 85 మందితో పాటుగా మరో 50 మంది కార్మికులను నియమించి డ్రెయిన్లలో పూడికతీత పనులు, శానిటేషన్ పనులు చేపడుతున్నారు. మున్సిపల్ కమిషనర్ సుభాష్‌చంద్రబోస్ ఈ పనులను పర్యవేక్షిస్తున్నారు. వైద్య శిబిరాలు కొనసాగుతున్నాయి. పది బృందాలు ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నాయి. డీఎంహెచ్‌ఓ డాక్టర్ దయాకర్ సర్వే, శిబిరాలను పర్యవేక్షిస్తున్నారు. సోమవారం మసీదు ఎదురు రోడ్డు, పోలీసుస్టేషన్ ఎదురు రోడ్లలో ముగ్గురు అతిసార బారిన పడ్డారు. వారిలో ఒక్కరే ప్రభుత్వాస్పత్రికి వైద్యం కోసం వెళ్లారు. అక్కడకక్కడా డయేరియా లక్షణాలు కనిపిస్తుండటంతో పట్టణ వాసులు ఆందోళన చెందుతున్నారు.


