డీఎస్సీ అక్రమాలపై అవిశ్రాంత పోరాటం | - | Sakshi
Sakshi News home page

డీఎస్సీ అక్రమాలపై అవిశ్రాంత పోరాటం

Aug 9 2026 2:28 AM | Updated on Aug 9 2026 2:28 AM

మంత్రి నారా లోకేష్‌ రాజీనామా చేయాల్సిందే వైఎస్సార్‌ సీపీ నేతలు దేవినేని, మల్లాది, వెలంపల్లి

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): మెగా డీఎస్సీ –2025లో జరిగిన అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్‌ రాజీనామా చేసేంతవరకు పోరాటం ఆగదని వైఎస్సార్‌ సీపీ నేతలు స్పష్టం చేశారు. డీఎస్సీ అవినీతి, అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించి ప్రభుత్వం తన చిత్తశుద్ధిని చాటుకోవాలన్నారు. అలంకార్‌ సెంటర్‌లోని ధర్నా చౌక్‌లో శనివారం మూడో రోజు రిలేనిరాహార దీక్షలు జరిగాయి. వైఎస్సార్‌సీపీ ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నగరంలోని మూడు నియోజకవర్గాలకు చెందిన యువత, వైఎస్సార్‌సీపీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రభుత్వ తీరును ఎండగట్టారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి డీఎస్సీ అక్రమాలపై విలేకరుల సమావేశంలో ఆధారాలతో సహా నిరూపించినా సిగ్గులేని చర్యలు తీసుకోకపోగా ప్రతిపక్షాలపై ఎదురుదాడికి దిగడం ప్రభుత్వ దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. నీట్‌ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేశారని, అదే కూటమిలో ఉన్న లోకేష్‌ మాత్రం మంత్రి పదవిని అంటిపెట్టుకుని వేలాడుతున్నారన్నారు. ఆయన నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాల్సిందేనని వైఎస్సార్‌సీపీ నేతలు, యువత ముక్తకంఠంతో డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో వైఎస్సార్‌సీపీ ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్‌ మాట్లాడుతూ డీఎస్సీ అక్రమాలపై శాంతియుతంగా దీక్షలు చేస్తుంటే పోలీసుల సహకారంతో వచ్చి దాడి చేస్తారా అని నిలదీశారు. ఎమ్మెల్యే బొండాను ఉద్దేశించి టెంట్‌ పీకి, నాలుగు కుర్చీలు పగుల కొడితే హీరోయిజం అనుకుంటున్నావా? నీ అక్రమాలు బయటపెడితే తల ఎక్కడ పెట్టుకుంటావని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత బొండా ఉమాకు తగిన బుద్ది చెబుతామన్నారు. మాజీ మంత్రి వెలంపల్లి శ్రీని వాసరావు మాట్లాడుతూ డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణకు డిమాండ్‌ చేస్తే ప్రభుత్వం నోరు మెదపడం లేదన్నారు. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో శాంతియుతంగా దీక్ష చేస్తుంటే బొండా ఉమా ఒక రౌడీ లాగా తన అనుచరులతో వచ్చి పోలీసులను పక్కకు నెట్టేసి దాడి చేశారన్నారు. ధర్నాలో ఎమ్మెల్సీ ఎండీ రుహుల్లా, మాజీ మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి, మాజీ డెప్యూటీ మేయర్లు అవుతు శ్రీశైలజారెడ్డి, బెల్లం దుర్గ, పార్టీ నాయకులు బండి పుణ్యశీల, అడపా శేషు, వంగవీటి నరేంద్ర, షేక్‌ ఆసిఫ్‌, షేక్‌ గౌస్‌ మొహిద్దీన్‌, ఆళ్ల చెల్లారావు, ఎ. రవిచంద్ర, సుందర్‌పాల్‌, మెహబూబా, మాజీ కార్పొరేటర్లు, పార్టీ అను బంధ విభాగాల ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement