భద్రాచలంఅర్బన్: మతిస్థిమితం సరిగా లేక ఇంటి నుంచి వెళ్లిపోయిన వృద్ధుడి కోసం కుటుంబ సభ్యులు వెతుకుతుండగానే గోదావరిలో మృతదేహంగా తేలాడు. మృతుడిని ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పట్టణానికి చెందిన గోద రాములు(75)గా పోలీసులు గుర్తించారు. ఆయనకు మతిస్థిమితం సరిగా లేకపోవడంతో ఈ నెల 5న తిరువూరు బస్టాండ్ నుంచి భద్రాచలం వెళ్లే బస్సు ఎక్కాడు. అనంతరం ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ టీవీ కెమెరాల ఫుటేజీల్లో భద్రాచలం బస్సు ఎక్కినట్లు గుర్తించారు. దీంతో వారు గురువారం రాత్రి భద్రాచలం చేరుకుని గాలించినా ఫలితం దక్కలేదు. ఇంతలోనే శుక్రవారం ఉదయం భద్రాచలం వైకుంఠధామం సమీపాన గోదావరి ఒడ్డున గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. టౌన్ పోలీసులు మృతుడి ఫొటో, దుస్తుల వివరాలను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేయగా కుటుంబ సభ్యులు పరిశీలించి మృతదేహం రాములుదేనని నిర్ధారించారు. ఘటనపై కుమారుడు బాలకృష్ణ ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని ఎస్‌ఐ రామకృష్ణ తెలిపారు.


