డ్రగ్స్‌పై యువతే ఉక్కుపాదం మోపాలి | - | Sakshi
Sakshi News home page

డ్రగ్స్‌పై యువతే ఉక్కుపాదం మోపాలి

Aug 8 2026 1:41 AM | Updated on Aug 8 2026 1:41 AM

డ్రగ్స్‌పై యువతే ఉక్కుపాదం మోపాలి

సివిల్‌ జడ్జి వరలక్ష్మి

కోనేరుసెంటర్‌: సమాజంలో డ్రగ్స్‌ మహమ్మారిని తరిమికొట్టటంలో యువత మరింత ముందుండాలని సివిల్‌ జడ్జి ఎస్‌. వరలక్ష్మి పిలుపునిచ్చారు. కృష్ణా విశ్వవిద్యాలయం ఎన్‌ఎస్‌ఎస్‌ ఆధ్వర్యంలో ‘మాదకద్రవ్యాల వినియోగం, వాటి పర్యావసానాలు’ అనే అంశంపై శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆమె మాట్లాడుతూ మాదకద్రవ్యాల వినియోగం వల్ల ముఖ్యంగా యువత చెడునడతకు అలవడుతుందన్నారు. తద్వారా అనేక అనర్థాలు చూడాల్సి వస్తోందన్నారు. డ్రగ్స్‌ మహమ్మారిపై యువత ఉక్కుపాదం మోపాలన్నారు. బందరు ఇన్‌చార్జ్‌ డీఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ మాదకద్రవ్యాలను నియంత్రణకు పోలీసుశాఖ నిరంతరం కృషి చేస్తోందన్నారు.

వ్యసనాల జోలికి పోవద్దు..

వర్సిటీ ఉపకులపతి ఆచార్య కె. రాంజీ మాట్లాడుతూ విశ్వవిద్యాలయంలో యువత ఎటువంటి వ్యసనాల జోలికి పోకుండా భవిష్యత్తు మీద దృష్టి సారించాలన్నారు. కార్యక్రమంలో మై భారత్‌ ఎన్టీఆర్‌ జిల్లా యువజన అధికారి బి. ప్రదీప్‌ కుమార్‌, ఆర్‌పేట సీఐ ఏసుబాబు, ఎన్‌ఎస్‌ఎస్‌ సమన్వయకర్త డాక్టర్‌ ఎం. శ్రావణి, న్యాయవాది సీహెచ్‌ ముసలయ్య తదితరులు పాల్గొన్నారు.

పొట్టకూటి కోసం వెళ్లి.. మృత్యు ఒడికి..

ట్రాక్టర్‌ బోల్తా పడడంతో కూలీ మృతి

బోనకల్‌: రెక్కాడితే డొక్కాడని ఓ కూలీ కుటుంబ పోషణ కోసం రాష్ట్రం దాటి రాగా ప్రమాదంలో మృత్యు వాత పడ్డాడు. ఘటనకు సంబంధించి వివరాలు.. ఎన్టీఆర్‌ జిల్లా విస్సన్నపేట మండలం వేమిరెడ్డిపల్లికి చెందిన తేజావత్‌ రాము(40) జీవనోపాధి కోసం అత్త వారిల్లయిన ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం బ్రాహ్మణకుంట తండాకు వచ్చి రేకుల షెడ్డు వేసుకుని ఉంటున్నాడు. బోనకల్‌ మండలంలో విద్యుత్‌ స్తంభాల ఏర్పాటు పనులకు బ్రాహ్మణ కుంట తండా నుంచి పది మంది కూలీలతో కలిసి ఆయన వెళ్లాడు. రావినూతల సబ్‌స్టేషన్‌ నుంచి విద్యుత్‌ స్తంభాలను ట్రాక్టర్‌ ట్రాలీలో వేసుకుని వెళ్తుండగా ముష్టికుంట్ల సమీపాన మూలమలుపు వద్ద ట్రాక్టర్‌ అదుపుతప్పి పక్కన గోతిలోకి దూసుకెళ్లింది. దీంతో ట్రాలీ పల్టీ కొట్టడంతో రాము కింద చిక్కుకోగా మిగతా వారు బయటపడ్డారు. స్థానికులు ఆయనను బయటకు తీసి 108 వాహనంలో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. కాగా, రాముకు భార్య, కుమారుడు, కుమార్తె ఉండగా.. కుమార్తె వివాహం రెండు నెలల క్రితమే జరిపించాడు. ఘటనపై అందిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ మాచినేని రవి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement